రంజీ ట్రోఫీలో చెలరేగిన షమీ.. 17 ఓవర్లలో 9 మొయిడెన్లు

రంజీ ట్రోఫీలో చెలరేగిన షమీ.. 17 ఓవర్లలో 9 మొయిడెన్లు

కల్యాణి : టీమిండియాలోకి తిరిగి రావాలనే పట్టుదలతో ఉన్న సీనియర్‌‌ పేసర్‌‌ మహ్మద్‌‌ షమీ రంజీ ట్రోఫీలో అదరగొట్టాడు. బెంగాల్‌‌ తరఫున ఢిల్లీతో ఆదివారం ప్రారంభమైన మ్యాచ్‌‌లో 30 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అతడి ధాటికి బెంగాల్‌‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌‌ చేయడంతో ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌‌లో 240 పరుగులకు ఆలౌటైంది. షమీ 17.3 ఓవర్లు వేసి తొమ్మిది మెయిడెన్లు నమోదు చేయడం విశేషం. స్వింగ్‌‌, సీమ్‌‌ కదలికలను సమర్థంగా ఉపయోగిస్తూ ఢిల్లీ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. 

బెంగాల్‌‌ తరఫున ఆకాశ్‌‌ దీప్‌‌ రెండు వికెట్లు తీయగా, ఆమిర్‌‌ గనీ మూడు వికెట్లు పడగొట్టాడు. గతేడాది రంజీ సీజన్‌‌లోనూ షమీ అద్భుతంగా రాణించి ఏడు మ్యాచ్‌‌ల్లో 37 వికెట్లు సాధించాడు. 2025 ఛాంపియన్స్‌‌ ట్రోఫీ ఫైనల్‌‌ తర్వాత భారత జట్టుకు ఆడని షమీ.. తాజా ప్రదర్శనతో తన ఫిట్‌‌నెస్‌‌, బౌలింగ్‌‌ సామర్థ్యాన్ని చాటుకున్నాడు. జాతీయ జట్టులోకి పునరాగమనం కోసం అతడి ప్రదర్శన కీలకంగా మారింది.