పదేళ్లుగా కడుపునొప్పితో బాధ.. గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

పదేళ్లుగా కడుపునొప్పితో బాధ.. గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి చెందాడు. హర్యానా రాష్ట్రానికి చెందిన సౌరభ్ శేఖర్ (36) హీలియం గ్యాస్ పీల్చడం వల్ల మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సౌరభ్ నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. రాయదుర్గంలోని మై హోమ్ ఆభ్రాలో నివసిస్తున్న తన సోదరుడి ఇంట్లో ఉంటున్నాడు. శనివారం మధ్యాహ్నం స్నేహితుడిని కలవడానికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. అదే రోజు రాత్రి 7.30 గంటల సమయంలో కొండాపూర్‌లోని రాఘవేంద్ర కాలనీలో ఉన్న వీపీ హైట్స్ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో ఉన్నట్లు కుటుంబ సభ్యుల వాట్సాప్ గ్రూపులో చిరునామా పంపించాడు.ఆదివారం ఉదయం వరకు సౌరభ్ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు. అతను ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆందోళనకు గురైన సోదరుడు కొండాపూర్‌లోని అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. సంబంధిత ఫ్లాట్ తలుపులు తెరిచి చూడగా సౌరభ్ మృతి చెంది కనిపించాడు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

సౌరభ్ ముఖానికి ప్లాస్టిక్ సంచి ఉండటం, సమీపంలో హీలియం గ్యాస్ సిలిండర్ ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ‘అమ్మా, నాన్న నన్ను క్షమించండి’ అని రాసిన సూసైడ్ నోట్ లభించినట్లు సమాచారం. గత పదేళ్లుగా భోజనం చేసిన తర్వాత కడుపునొప్పితో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం.

పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సౌరభ్ మృతికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, దర్యాప్తు వివరాల ఆధారంగా మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది