- అక్కన్నపేట మండలం సేవాలాల్ తండాలో ఘటన
- మొదటి భర్త కూతురిపై వేధింపులే కారణమని అనుమానాలు
హుస్నాబాద్/అక్కన్నపేట, వెలుగు : ఓ మహిళ తన భర్తను చెట్టుకు కట్టేసి, కంట్లో కారం చల్లి రాడ్ తో తలపై కొట్టి దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం సేవాలాల్ మహారాజ్ తండాలో ఆదివారం జరిగింది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హనుమకొండ జిల్లా నర్మెట్ట మండలం మలక్‌పేట్‌కు చెందిన భగవాన్ మొదటి భార్య చనిపోవడంతో సేవాలాల్ మహారాజ్ తండాకు చెందిన బానోత్ రాజేశ్వరిని రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యను భగవానే హత్య చేసినట్లు అతడిపై కేసు నడుస్తోంది.
రాజేశ్వరికి సైతం ఇది రెండో వివాహం. రాజేశ్వరికి మొదటి భర్త ద్వారా ఓ కూతురు ఉండగా.. భగవాన్‌తో మరో ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రాజేశ్వరి ఆదివారం సేవాలాల్ మహారాజ్ తండాలోని తల్లిగారింట్లో ఉండగా.. భగవాన్ మద్యం మత్తులో అక్కడికి వచ్చి, రాజేశ్వరిని, ఆమె బిడ్డను చంపుతానని బెదిరించాడు. దీంతో ఆగ్రహానికి గురైన రాజేశ్వరి.. భగవాన్ కండ్లలో కారం చల్లి, చెట్టుకు కట్టేసింది.
అనంతరం ఇనుప రాడ్ తో తలపై కొట్టడంతో భగవాన్ అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న హుస్నాబాద్ సీఐ శ్రీధర్, అక్కన్నపేట ఎస్సై ప్రశాంత్ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. రాజేశ్వరితో పాటు సహకరించిన ఆమె తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, రాజేశ్వరి మొదటి భర్త కూతురిని భగవాన్ వేధిస్తుండడంతో, ఆ బాధ తట్టుకోలేకనే హత్య చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
