పొయెట్రీ కార్నర్ : ఆక్సిజన్ ఆత్మక‘వనం’.. మార్నింగ్ వాక్.. భానుడి కిరణాల వెలుగులు

పొయెట్రీ కార్నర్ : ఆక్సిజన్ ఆత్మక‘వనం’.. మార్నింగ్ వాక్.. భానుడి కిరణాల వెలుగులు

మార్నింగ్ వాక్ తో ఉదయానికి 
స్వాగత రహదారి వెతుకుతున్నప్పుడు
భానుడి కిరణాల వెలుగుల వేళ,
ఒంటరిగా నిలిచిన 
ఓ నిర్జీవమవుతున్న చెట్టు
నిశ్శబ్ద నిశీధి చీల్చుకుంటూ
నా మనసుతో కాసేపు సంభాషించింది...!

‘మనిషీ!
నీ ఉనికి ఊపిరికి 
సాక్షీ భూతాన్ని 
నీ బతుకు కాంతికి
 నీడ గీతాన్ని 
నీ పసితన పల్లవికి 
 ఊయల దీపాన్ని 
నీ ఆకలి జ్వాలకు 
అమృత ఆహారాన్ని నేను..!

నీ నిర్లక్ష్య ఆధిపత్య 
స్వార్థపూరిత చదరంగంలో 
నన్నెందుకు మరచిపోయావు?
సాంకేతిక డిజిటల్ మాయలో
కాలుష్య మృత్యు నిలయంలో 
పచ్చని గ్రహాన్ని ఎందుకు చంపుతున్నావ్?

కాంక్రీటు అడవుల 
కదన సీమలో
జీవనదుల ప్రవాహగుండెల్లో
ప్లాస్టిక్ గాయాల శాసనాలు రాశావు,
ఆకాశం ఆత్మ స్వచ్ఛతను
కర్బన ఉద్గారాల పొగలతో
కనబడకుండా కమ్మేశావు

ఇప్పుడు చూడు...
మండుటెండలో కనుమరుగైన
ఋతువుల వర్షాల దీనగాథలు 
ఏడవలేక చస్తున్నాయి,
నదులు జీవన దాహంతో 
విలవిలలాడుతున్నాయి,
పక్షుల గల గల శ్రావ్య పాటలు 
మూగబోతున్నాయి,
భూమాత  గుండె మంటలు 
ఆమ్ల వర్షాల సుడిగుండాల్లో
చిరునామా కరువై బరువెక్కుతున్నాయి

నేడు ప్రతీ చెట్టు కన్నీటి 
నిస్సహాయత స్వరం
అడవుల నరికివేతలను 
నదుల ఆర్తనాద ఘోషలను 
వలసవాదాలను చెబుతున్న 
పక్షుల గూడులను 
ప్రశ్నించే యుద్ధతంత్రమయ్యింది’

నాకర్థమైంది 
చెట్టు మౌనంలోని 
మాటల శ్వాస గాఢత
పర్యావరణ పరిణామంలోని 
ప్రకృతి గుండె తీవ్రత

గాలి  నిశ్శబ్ద ఉద్యమం 
ఆకాశం వినే పచ్చని విప్లవమై
ధరణి మది నిండా 
వన మహోత్సవం పండాలి
పచ్చని ఆశల సవ్వడిలో 
పంచభూతాల చిరునవ్వుల 
హారాలు మెరవాలి 
ఆప్యాయత సంద్రంలో 
మొక్కలను హత్తుకుంటే 
జీవవైవిధ్య మనుగడ 
ప్లాస్టిక్ మత రహితమవుతుంది
అంతర్జాలంలో అలంకార అక్షరాల 
వెలుగులు వెతకకండి 
మన అంతరాత్మలో పర్యావరణ స్పృహ 
విత్తనాలను శోధించండి..!

ఇప్పుడు భవిష్యత్​ను బతికించడానికి 
జగతంతా జాగృతమై చదవాల్సిన 
బతుకు పుస్తకం ఆక్సిజన్ ఆత్మకథనే..!

                           ‌‌- ఫిజిక్స్ అరుణ్ కుమార్-