బాలా త్రిపుర సుందరి దేవిగా వనదుర్గమ్మ 

బాలా త్రిపుర సుందరి దేవిగా వనదుర్గమ్మ 
  •     ఉమ్మడి మెదక్ జిల్లాలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం


పాపన్నపేట/ చిలప్​చెడ్/ ఝరాసంఘం, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల్లో తొలిరోజు వనదుర్గా భవానీ మాత బాలా త్రిపుర సుందరి దేవి (శైలపుత్రి) రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అడిషనల్ కలెక్టర్ నగేశ్​అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఊరేగించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిలప్‌‌‌‌‌‌‌‌చెడ్ మండలం చిట్కుల్ శివారులోని మంజీరా నది తీరాన ఉన్న చాముండేశ్వరీ ఆలయంలో అమ్మవారికి మహాభిషేకం నిర్వహించారు. అర్చకులు ప్రభాకర్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. శివ్వంపేట భగలాముఖి అమ్మవారి ఆలయంలోనూ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. సంగారెడ్డి జిల్లా ఝరాసంఘం కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయంలోనూ ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు అమ్మవారిని పసుపు రంగు చీరతో అలంకరించగా, మంగళగౌరీ దేవిగా దర్శనమిచ్చారు. ఆలయ ఈవో శివరుద్రప్ప భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు.

జోగులాంబ ఆలయంలో నవరాత్రులు షురూ

అలంపూర్: జోగులాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో ఆదివారం శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలుత స్వామివారి ఆనతి స్వీకరణ, యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యాహవాచనం, రుత్విక్‌‌‌‌‌‌‌‌ వర్ణం, మహాకలశ స్థాపన, అగ్నిముఖం తదితర క్రతువులను నిర్వహించారు. సాయంత్రం అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలను ఎమ్మెల్యే విజయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ ఈవో దీప్తి పాల్గొన్నారు.