టీమిండియా ఆలౌట్.. వెస్టిండీస్ టార్గెట్ 224 పరుగులు 

టీమిండియా ఆలౌట్.. వెస్టిండీస్ టార్గెట్ 224 పరుగులు 

IND vs WI: ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. ప్రత్యర్థి వెస్టిండీస్ ముందుకు 224 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీతో చెలరేగగా, మిగతా బ్యాటర్లు వేగంగా పరుగులు సాధించడంతో భారత్ భారీ స్కోరును నమోదు చేయగలిగింది.

అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ: 

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్ అభిషేక్ శర్మ (69) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో బలమైన పునాది వేశాడు. విండీస్ బౌలర్లను నలువైపులా బాదుతూ వేగవంతమైన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో అత్యంత వేగంగా 2000 పరుగులని కూడా పూర్తి చేసుకున్నాడు అభిషేక్, మరోవైపు, మిడిల్ ఆర్డర్లో ఇషాన్ కిషన్ (37), తిలక్ వర్మ (28), ఆల్ రౌండర్లు నితీష్ కుమార్ రెడ్డి (21), అక్షర్ పటేల్ (20) లు వేగంగా పరుగులు సాధించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే, సంజు శాంసన్ (3), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (1), నమన్ ధీర్ (10)లు తక్కువ పరుగులకే అవుటై నిరాశపరిచారు.

చివరి ఓవర్లో ప్రిన్స్ యాదవ్ బాదుడు: 

చివర్లో పేసర్ ప్రిన్స్ యాదవ్ (13) బౌండరీ (4,0, 4, 4, 1b, W)లతో  మెరిశాడు. చివరి ఓవర్లో వరుస బౌండరీలతో చెలరేగి జట్టు స్కోరును 223 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

కట్టడి చేసిన కరేబియన్ బౌలర్లు: 

ఒకానొక దశలో భారత్ భారీ స్కోరు సాధించేలా కనిపించినా.. వెస్టిండీస్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ కట్టడి చేశారు. విండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్, స్ప్రింగర్, షమర్ జోసెఫ్‌లు రెండేసి వికెట్లు పడగొట్టగా.. కీమో పాల్, గుడాకేష్ మోటీలకు తలో వికెట్ దక్కింది. ఇప్పటికే 1–1తో సమంగా ఉన్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో లీడ్ సాధించాలంటే విండీస్ 224 పరుగులు చేయాల్సి ఉంది.