ఎన్నికలకు నేను సిద్ధమే.. ఎవరు కావాలో ప్రజలే తేలుస్తారు: ట్రంప్‎కు జెలెన్స్కీకౌంటర్

ఎన్నికలకు నేను సిద్ధమే.. ఎవరు కావాలో ప్రజలే తేలుస్తారు: ట్రంప్‎కు జెలెన్స్కీకౌంటర్

కీవ్: ఉక్రెయిన్‏కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్‎లో అధ్యక్ష ఎన్నికల నిర్వహణకు తాను సిద్ధమేనని ప్రకటించారు. రష్యా 60 రోజుల పూర్తిస్థాయి కాల్పుల విరమణకు అంగీకరిస్తే ఉక్రెయిన్‎లో అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అప్పుడు తమ దేశానికి ఎవరు నాయకత్వం వహించాలనేది ఉక్రెయిన్ ప్రజలే నిర్ణయించుకుంటారని పేర్కొన్నారు. 

‘‘రష్యాతో యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో ప్రస్తుతం మార్షల్ లా (సైనిక చట్టం) అమలులో ఉంది. దీని వల్ల సాధారణ ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగబద్ధంగా వీలుపడదు. రష్యా కనుక రెండు నెలల పాటు దాడులు పూర్తిగా ఆపితే ఉక్రెయిన్‎లో అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తాం. అప్పుడు తమ దేశానికి ఎవరు నాయకత్వం వహించాలనేది ఉక్రెయిన్ ప్రజలే నిర్ణయించుకుంటారు’’ అని ఏబీసీ న్యూస్ దిస్ వీక్ ఇంటర్వ్యూలో జెలెన్స్కీ పేర్కొన్నారు. అలాగే, ఉక్రెయిన్ ఇంధన మౌలిక సదుపాయాలపై రష్యా దాడులు ఆపివేస్తే..  మేం కూడా రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులను నిలిపివేస్తామని జెలెన్స్కీ ప్రకటించారు. 

ఉక్రెయిన్‎కు కొత్త అధ్యక్షుడు అవసరం: ట్రంప్

అమెరికాలో నవంబర్‎లో జరగనున్న మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో దేశంలో ఇంధన ధరల కట్టడి కోసం ట్రంప్ రష్యాతో చమురు ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో జెలెన్స్కీపై ట్రంప్ ఫైర్ అయ్యారు. రష్యాతో యుద్ధాన్ని ముగించడంలో జెలెన్స్కీ ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. రష్యాతో శాంతి ఒప్పందాలు కుదుర్చుకోవడంలో జెలెన్స్కీ ఏ మాత్రం చొరవ చూపలేదని ఆరోపించారు. 

రష్యాతో యుద్ధం కారణంగా జెలెన్స్కీ ఉక్రెయిన్ 30 శాతం భూభాగాన్ని కోల్పోయారని.. ఇరు దేశాల మధ్య పది లక్షలకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారని.. రెండు మిలియన్ల కంటే ఎక్కువ మంది చనిపోయారని పేర్కొన్నారు. అసలు ఇది ప్రారంభం కాకూడని ఒక అనవసరమైన యుద్ధమని అభిప్రాయపడ్డారు.

రష్యాలోని చమురు శుద్ధి కర్మాగారాలపై ఉక్రెయిన్ దాడులు చేయడం వల్లే అమెరికాతో పాటు అంతర్జాతీయంగా ఇంధన కొరత ఏర్పడిందన్నారు. అమెరికాలోని రైతులు, పశుపోషకులు డీజిల్ ఇంధన ధరల పరంగా ఇబ్బందులు పడుతున్నారని వ్యక్తం చేశారు. 

రష్యాలోని ఇంధన మౌలిక సదుయాలపై తక్షణమే దాడులు నిలిపివేయాలని ఉక్రెయిన్‎ను హెచ్చరించారు. రష్యాతో శాంతి ఒప్పందం కుదుర్చుకుని యుద్ధాన్ని ఆపేందుకు జెలెన్స్కీ స్థానంలో ఉక్రెయిన్‎కు కొత్త అధ్యక్షుడు రావాల్సిన సమయం ఆసన్నమైందని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.