గాంధీ, అంబేద్కర్‌‌‌‌‌‌‌‌, నెహ్రూ దారిలో అభిజిత్‌‌‌‌ దీప్కే న్యూ నేషనలిజం

గాంధీ, అంబేద్కర్‌‌‌‌‌‌‌‌, నెహ్రూ దారిలో అభిజిత్‌‌‌‌ దీప్కే న్యూ నేషనలిజం

అభిజిత్ దీప్కే అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 8, 2026న  బెంగళూరు ఫ్రీడం మైదానంలో  కాక్రోచ్‌‌‌‌ జనతా పార్టీ,  ప్రకాశ్​రాజ్‌‌‌‌ సహాయంతో ఆర్గనైజ్‌‌‌‌ చేసిన మహా ప్రొటెస్టులో ఈ సంక్షోభానికి తగిన జాతీయవాద నిర్వచనం గాంధీ, అంబేద్కర్‌‌‌‌‌‌‌‌, నెహ్రూల పాత్ర నిర్వచనాలతో మొత్తం దేశాన్ని ఉత్తేజపరిచాడు.  నాకు కూడా చాలాకాలంగా గాంధీ,  నెహ్రూల పట్ల వ్యతిరేకత ఉండేది. చాలా కాలం కార్ల్‌‌‌‌మార్క్స్‌‌‌‌ సిద్ధాంతమే విముక్తి మార్గం అనుకున్నాను.

అంబేద్కరిస్టుగా 1990వ దశకంలో మారిన తరువాత కూడా చాలా కాలం గాంధీ,  నెహ్రూ పట్ల వ్యతిరేకత కొనసాగింది. కానీ, 2014లో బీజేపీ, ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ఎస్ అధికారంలోకి వచ్చి మతపునాదిగానే జాతీయవాదాన్ని దేశంమీద రుద్దుతున్నప్పుడు ఆ పునాదితో  ఈ దేశంలో 1947 నుంచి 2014 వరకు బతికి బట్టకట్టిన రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందనే భయం మొదలైంది.

అందుకు ఒక ప్రధాన కారణం ఈ దేశాన్ని చుట్టుముట్టి ఉన్న ముస్లిం దేశాల్లో,  చైనాలో  ప్రజాస్వామ్యం లేదు. మతం పునాదిగానే అవి నియంతృత్వాలుగానే కొట్టుమిట్టాడుతున్నాయి. చైనా  భారత్‌‌‌‌ను వ్యతిరేకిస్తున్న దేశంగా ముస్లిం దేశాలకు అండగా ఉంటుంది. ఈ క్రమంలోనే అమెరికా, యూరప్‌‌‌‌ దేశాలు కూడా ఈ దేశం మతతత్వ దేశంగా మారడాన్ని బాగా వ్యతిరేకిస్తున్నాయి. క్రమంగా ముస్లిం దేశాలతో మైత్రి చేస్తున్నాయి. ఈ దశలో ఒక ఇంజినీరింగ్ చదువుకున్న 30 సంవత్సరాల అభిజిత్‌‌‌‌.. గాంధీ, అంబేద్కర్‌‌‌‌‌‌‌‌, నెహ్రూలను ఒక ప్రజాస్వామ్య సిద్ధాంత ఐక్యతగల జాతినిర్మాణాలుగా నిర్వచించడం చాలా అనుచితంగా కనిపిస్తుంది.

దేశం ఆత్మగాంధీ
అభిజిత్ నిర్వచనం ఈ దేశానికి ఆత్మ మహాత్మా గాంధీ.  ఎందుకు గాంధీ ఈ దేశ ఆత్మ అయితాడు అని ఆయన వివరించలేదు.  కానీ నా దృష్టిలో గాంధీ స్వాతంత్ర్య పోరాటంలో ముస్లిం నియంతృత్వం దేశాల మధ్య, కమ్యూనిస్టు విప్లవాల మధ్య ఇరుక్కుని ఉన్న ఈ దేశాన్ని ఒక హిందూ మత నమ్మకస్థులుగా ఉండి హింస పునాదిగా కాకుండా అహింస,  సత్యాగ్రహం పునాదిగా  ఒక దేశస్థాయి ఉద్యమాన్ని నడిపాడు. రామరాజ్యం వంటి ప్రాచీన రాజ్యవిలువలు గురించి మాట్లాడుతూనే ఆయన ఎన్నో మతాలు, ముఖ్యంగా సుదీర్ఘకాలం ముస్లిం పాలన మత పునాదిగా జరిగిన ఈ దేశానికి సెక్యులర్‌‌‌‌‌‌‌‌  వ్యవస్థ  ఒక కవచంలా పనిచేస్తున్నదని గ్రహించాడు.
 
‘రామ్, రహీం, ఈశ్వర్‌‌‌‌‌‌‌‌ అల్లా తేరేనామ్‌‌‌‌’ వంటి మత నినాదాలిస్తూనే హిందూ మహాసభకు, ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌కు దూరంగా ఉండి ఉద్యమాన్ని నడిపాడు. ఆయన ముఖ్యంగా ఇస్లాం మతంతో,  హిందూ మతంతో  నిరంతరం ఇతర మతాలతో తగువులో ఉంటే దేశం మొత్తానికి ప్రమాదం అని గ్రహించాడు. ఇప్పడు ఆర్ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌, బీజేపీ ప్రభుత్వాలు  ముస్లింలకు వ్యతిరేక యుద్ధ వాతావరణాన్ని ఇంటా బయట కల్పించడం వల్ల ఈ ప్రజలందరూ  నష్టపోతారు.

సర్‌‌‌‌‌‌‌‌ ముఖ్యంగా  ముస్లిం ఓట్లను కట్టడి చేయాలని ప్రారంభించి, 80 శాతానికి పైగా ఎస్సీ,  ఎస్టీ, ఓబీసీల ఓట్లను తొలగించారు. 13కోట్ల ఓట్లలో   తొలగించిన ముస్లిం ఓట్లు 2 కోట్లు ఉండొచ్చు. ఈ స్థితిని అభిజిత్‌‌‌‌ గ్రహించినంత  స్పష్టంగా ఏ సీనియర్‌‌‌‌‌‌‌‌  నాయకుడు  గ్రహించలేదు. అందుకే  గాంధీ  ఈ  భవిష్యత్‌‌‌‌ భారత్‌‌‌‌కు కూడా ఆత్మలాంటివాడు అని ఈ దశలో నిర్వచించడం చాలా అవసరం. ఆయనను  నాధూరాం గాడ్సే చంపడం వల్ల ఆయన మన ఆత్మల్లో జీవిస్తున్నాడని వేలాదిమంది యువకుల చేత  నినదింపజేశాడు.

అంబేద్కర్‌‌‌‌‌‌‌‌ దేశానికి వెన్నెముక
చాలామంది అంబేద్కరిస్టులకు అంబేద్కర్‌‌‌‌‌‌‌‌ను గాంధీ, నెహ్రూల మధ్య చూపెట్టడం నచ్చదు అని మనకు తెలుసు. కానీ ఈ వయసులో  అభిజిత్‌‌‌‌ ఒక విశాల యువ సమీకరణ చేసే శక్తిగా, పక్షపాతిగా వ్యవహరించడం కుదరదు. అయినా అతను జైభీమ్‌‌‌‌, జై భీమ్‌‌‌‌ అని వేలాదిమంది అగ్రకుల యువకులచే నినదింపజేశాడు. అది మామూలు విషయం కాదు.  అంబేద్కర్‌‌‌‌‌‌‌‌  నినాదం కేవలం దళిత ఉద్యమంలో మాత్రమే ఉండేది. కానీ అభిజిత్‌‌‌‌ దాన్ని దేశ యువకులందరిచేత అనిపిస్తూ  ఆ నేత  దేశానికి ఎలా  వెన్నెముకలాంటివాడో  చెబుతూ ఈ నినాదాన్ని వారిచే చెప్పించాడు.

భారతదేశ రాజకీయాల భవిష్యత్తులో ఇదొక ముందడుగు. అంబేద్కర్‌‌‌‌‌‌‌‌ రాజ్యాంగ నిర్మాణ కమిటీ చైర్మన్‌‌‌‌గా, గొప్ప ఇంటర్నేషనల్‌‌‌‌,  ఇండియన్‌‌‌‌  లీగల్‌‌‌‌  సిస్టమ్‌‌‌‌ ఎక్స్‌‌‌‌పర్ట్‌‌‌‌గా, ప్రాచీన తత్వ, లీగల్‌‌‌‌ శాస్త్రాలపై పట్టుగల మేధావిగా రాజ్యాంగ నిర్మాణం చేశాడు. ఆయనే ఆ రాజ్యాంగ నిర్మాణానికి  కర్త, కర్మ, క్రియ అని చెప్పడానికి ఆయన కాన్‌‌‌‌స్టిట్యుయంట్‌‌‌‌ అసెంబ్లీలో ఇచ్చిన ఉపన్యాసాలు, రాజ్యాంగ డిఫెన్స్‌‌‌‌,  కొత్త కొత్త ప్రతిపాదనలు మంచి ఉదాహరణలు.

బీఎన్‌‌‌‌ రావులాంటివారు ఆయనతోపాటు ఇచ్చిన ఉపన్యాసాలకు, రాజ్యాంగ డిఫెన్స్‌‌‌‌కు వారిచ్చిన ఉపన్యాసాలే  కనిపించవు. తరువాత మొదటి లా మినిస్టర్‌‌‌‌‌‌‌‌గా అంబేద్కర్‌‌‌‌‌‌‌‌ రాజ్యాంగాన్ని ఈ దేశానికి ఎలా అమలుచెయ్యాలి, ఎలా ప్రజలకు ఓటుహక్కు కల్పించాలి అనే అంశాలను ఆచరణలో ఎస్టాబ్లిష్‌‌‌‌ చేశాడు. 

ఆయన రాసిన సిద్ధాంత గ్రంథాలు దేశంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే మూడు పిల్లర్లను ప్రజల మధ్య పరస్పర సమన్వయంతో జీవించడానికి బీజాలు వేశాయి. బౌద్ధిజం నుంచి ఆయన సమతా సూత్రాలను సమాజంలో చొప్పించి కుల వ్యవస్థను రద్దు చేయడానికి  కావాల్సిన సిద్ధాంతాలను అందించిపోయాడు. ఇన్ని కారణాల  వల్ల  అంబేద్కర్‌‌‌‌‌‌‌‌ ఈ దేశ జీవనానికి వెన్నెముకలాంటివాడు. అంబేద్కర్‌‌‌‌‌‌‌‌లో  గాంధీయ అహింస, నెహ్రూ హేతుబద్ధత కూడా ఇమిడి ఉన్నాయి.

నెహ్రూ దేశానికి మెదడు
ఇది చాలా కొత్త ఫార్ములా. నెహ్రూను ఇప్పటివరకు సెక్యులరిజం, డెమొక్రటిక్‌‌‌‌ సోషలిజానికి, పరిపాలనా దక్షతకు నాందిగా చూశారు మేధావులు. కానీ అభిజిత్‌‌‌‌ ఆయన దేశానికి మెదడు అన్నాడు.  ఎందుకు? అభిజిత్ అభిప్రాయంలో 1951–52లో జరిగిన ఎన్నికలు జరిగినప్పుడు నెహ్రూ దేశ ప్రధానమంత్రిగా ఓటు అంటే తెలియని గ్రామీణ ఆదివాసీ, దళిత, వెనుకబడిన తరగతుల, ఇత మతాల నిరక్ష్యరాస్యుల ఓటు నమోదు చేయించి ఓట్లలో పాల్గొనేలా పరిపాలన యంత్రాంగాన్ని ప్రజల మిత్రులుగా సహకరించేలా చేశాడు. ఆయన ఒక పెద్ద విద్యావంత బ్రాహ్మణ కుటుంబం నుంచి స్వాతంత్ర్య పోరాట కాలంలో అతిబీద ప్రజల మధ్య బతికాడు.

స్త్రీలు, పురుషులు అనే తేడా లేకుండా  ఓటుహక్కు  కల్పించాడు.  కానీ, మోదీ  ఓబీసీని అని చెప్పి  బీసీలవి, దళితులవి, ఆదివాసులవి,  ఎంతమంది  నిరక్షరాస్యులవి 13 కోట్ల ఓట్లు లేకుండా చేసి ధనవంతులకు, అగ్రకులాలకు మాత్రమే ఓట్లు ఉండేలా తన అనుచర సీఈసీలతో చేయించి  జీవితాంతం  ప్రధానమంత్రిగా ఉండాలని చూడడం ఎంత అన్యాయం.

అభిజిత్‌‌‌‌ ఆ విషయాన్నే యువతకు మళ్లీ మళ్లీ చెబుతున్నాడు. వయస్సును బట్టి (21) ఆడ, మగ, నిరక్షరాస్య, చదివిన, ధనవంత, బీద అందరికీ ప్రపంచంలోనే  మొదటిసారి నెహ్రూ ఓటుహక్కు కల్పించిన ప్రధానమంత్రి అయితే, 13 కోట్ల మంది ఓట్లు తీసేయించి ప్రధానమంత్రిగా కొనసాగాలనుకునే మోదీకి, నెహ్రూకి ఎంత తేడా ఉన్నదో అభిజిత్‌‌‌‌ అర్థం చేసుకున్నాడు.

ఇంత తెలివిగా, ఇంత ఎత్తుగడతో,  ఇంత ధైర్యంగా 30 ఏండ్ల యువకుడు దేశానికి సందేశమిస్తుంటే ప్రపంచమంతా ఆశ్చర్యపోతున్నది.  ప్రపంచ టీవీలు అతడిని ఇంటర్వ్యూ చేస్తున్నాయి.  ప్రపంచ పత్రికలు అతనిమీద వ్యాసాలు రాస్తున్నాయి. కానీ నరేంద్ర మోదీని ఒక ప్రపంచ టీవీ ఇప్పటివరకు ఇంటర్వ్యూ చేయలేదు.
 
దేశం అభిజిత్‌‌‌‌కు అండగా..
ఈ యువకుని పిలుపుకు యువత కదులుతుంది. కానీ మధ్య వయస్కులు, వృద్ధులు, అతను దేశానికిచ్చే కొత్త ఆలోచన విధానాన్ని పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. మేధావి వర్గం అంతా ఇప్పటికే ధనవంతమైన అగ్రకులాల్లోనే ఉన్నది.  వారు అభిజిత్ పోరాట పటిమను, ధైర్యాన్ని, తెలివితేటలను దేశం అర్థం చేసుకుని అతనికి మద్దతివ్వకపోతే నష్టపోయ్యేది దేశమే.  దేశం ఒక సంక్షోభ దశలో ఉంది. చుట్టూ  ఉన్న ముస్లిం దేశాలు, పక్కన ఉన్న బలమైన కమ్యూనిస్టు చైనాలో రాజులు లేదా ఒక నాయకుడు దశాబ్దాల తరబడి పరిపాలిస్తున్నారు.

ఆర్ఎస్ఎస్, బీజేపీలు అటువంటి వ్యవస్థను తమ వ్యక్తి చేతిలో ఉంచి దశాబ్దాల తరబడి పరిపాలిస్తూ పెట్టుబడిదారులకు, ఒకనాటి రాజకుటుంబాలకు, బాగా చదువుకున్న అగ్ర కుల శక్తులకు మాత్రమే ఓటుహక్కు మిగిల్చి, రష్యాలో పుతిన్ పాలిస్తున్నట్టు మోదీ కూడా అదే పద్ధతిలో పరిపాలించడానికి పూర్తిగా అంగీకారంతో ఉన్నట్లు కనబడుతుంది.

ఇది ఇప్పుడున్న రాజ్యాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి తమ సనాతన ధర్మ రాజ్యాంగాన్ని సంస్కృత గ్రంథాల ఆధారంగా రాయించాలని చాలా తీవ్రమైన ప్రయత్నంలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ స్థితిలో కాక్రోచ్‌‌‌‌ జనతాపార్టీ అభిజిత్‌‌‌‌, సౌరవ్‌‌‌‌దాస్‌‌‌‌, అశుతోష్‌‌‌‌ నాయకత్వంలో పుట్టి ఒక ఆశాకిరణాన్ని చూపించింది.

ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్

  • ఓపెన్​పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ [email protected]
  • రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
  • స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.