రెండో రోజు..అటుకుల బతుకమ్మ సంబరాలు

రెండో రోజు..అటుకుల బతుకమ్మ సంబరాలు

తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. పల్లెలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా మహిళలు సంప్రదాయబద్ధంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటున్నారు. ‘బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ ఉయ్యాల పాటలు పాడుతూ, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేస్తున్నారు. పెత్తరమాస ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ సంబురాలు సద్దుల బతుకమ్మ వరకు కొనసాగనున్నాయి.

ఆశ్వయుజ మాసం పాడ్యమి రోజున జరుపుకునే బతుకమ్మను అటుకుల బతుకమ్మగా పిలుస్తారు. ఈ సందర్భంగా మహిళలు వివిధ రకాల పూలను రెండు ఎత్తుల్లో అందంగా పేర్చి బతుకమ్మలను సిద్ధం చేస్తారు. అనంతరం అందరూ ఒకచోట చేరి బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడి ఆడిపాడుతారు. సాయంత్రం బతుకమ్మలను చెరువుల్లో నిమజ్జనం చేస్తారు.ఈ రోజున గౌరమ్మకు అటుకులు, బెల్లం, చప్పిడిపప్పు వంటి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. సంప్రదాయ పద్ధతుల్లో పూజలు నిర్వహించి, ప్రసాదాలను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో పంచుకుంటారు.

రేపు ముద్దపప్పు బతుకమ్మ ప్రత్యేకతలు

బతుకమ్మ వేడుకల్లో భాగంగా అక్టోబర్ 12న ముద్దపప్పు బతుకమ్మను జరుపుకోనున్నారు. ఈ రోజున మహిళలు మూడు అంతరాల్లో చామంతి, మందారం, సీతమ్మజడ, రామబాణం వంటి పూలతో బతుకమ్మలను అందంగా అలంకరిస్తారు. అనంతరం గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి ముద్దపప్పు, పాలు, బెల్లంతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. పూజల అనంతరం ప్రసాదాన్ని ఒకరికొకరు పంచుకుంటారు.

ముద్దపప్పు బతుకమ్మ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకమైన సంప్రదాయ వంటకాలను కూడా తయారు చేస్తారు. పుట్నాల పిండి, బియ్యప్పిండి, బెల్లం, ఎండు కొబ్బరి, నువ్వులు, పాలు కలిపి చలివిడి ముద్దలు చేస్తారు. మరికొందరు గారెలను తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.

సంప్రదాయాలు.. ఆచారాలతో బతుకమ్మ వేడుకలు

బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేసిన అనంతరం వాయనంగా సత్తుపిండి, పెసర్లు, చక్కెర, బెల్లం వంటి పదార్థాలను పంచుకునే సంప్రదాయం కూడా కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతోంది. పూల పండుగగా పేరొందిన బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది.మహిళల ఐక్యతను చాటుతూ, ప్రకృతిని ఆరాధిస్తూ నిర్వహించే ఈ వేడుకలు తెలంగాణ అంతటా ఉత్సాహభరిత వాతావరణాన్ని నెలకొల్పుతున్నాయి. రానున్న రోజుల్లో సద్దుల బతుకమ్మ వరకు ఈ పూల పండుగ మరింత వైభవంగా కొనసాగనుంది.