ఆశ్వయుజమాసం మొదలైంది.. ప్రాధాన్యత.. విశిష్టత ఇదే..!

ఆశ్వయుజమాసం మొదలైంది..   ప్రాధాన్యత.. విశిష్టత ఇదే..!

బాధ్రపదమాసం ముగిసింది.. ఆశ్వయుజమాసం(అక్టోబర్​ 11) ప్రారంభమైంది.  ఈ నెలలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.  పురాణాల ప్రకారం ఆశ్వయుజ మాసం త్రిముర్తులైన బ్రహ్మ,విష్ణు, మహేశ్వరులు.. దేవతలైన  సరస్వతి, మహాలక్ష్మీ, పార్వతిదేవిలకు అత్యంత ప్రీతికరమైన......వారి పూజలకు చాలా పవిత్రమైన నెల ఆశ్వయుజమాసమని పండితులు చెబుతున్నారు.మరి ఆశ్వయుజ మాసం.. విశిష్టత.. ప్రాధాన్యత గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..!

ఆశ్వయుజ మాసంలో జగన్మాత.. పార్వతిదేవి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్ధం, తొమ్మిది అవతారలను ధరించింది.  ఆయుర్వేద దేవుడు అయిన ‘ధన్వంతరీ, త్రిమతాచార్యులలో ద్వైత సిద్ధాంత ప్రవక్త శ్రీ మధ్వాచార్యులు కూడా ఆశ్వయుజమాసంలోనే జన్మించారు.హిందూ సంప్రదాయాల ప్రకారం ..  నరకాసురుడు అంతమొందింపబడి ప్రజలందరికి ఆనందాల వెలుగులను పంచిన దివ్య మాసము ఇది!  

ఆశ్వయుజ మాసం తొలి రోజు నుంచి  తొమ్మిది రోజులు  ..దేవి నవరాత్రులు ఉత్సవాలను  సంప్రదాయబద్ధంగా పూజలు చేస్తారు  భక్తులు.  కొంతమంది  కలశాన్ని స్థాపించి, ముగ్గురు అమ్మల మూలపుటమ్మను ఆశ్వయుజ మాసం శుక్ల పక్షం పాడ్యమి నుంచి ( 2026 అక్టోబర్​ 11)  తొమ్మిది రోజుల పాటు నియమముగా ఆరాధిస్తారు.  దాదాపు ప్రతి దేవాలయంలో కూడా దసరా నవరాత్రి పూజలు జరుగుతాయి. 

  ఆశ్వీయుజ మాసం అష్టమి, నవమి, దశమి తిథులలో అమ్మవారిని  పూజించిన భక్తులకు ఎటువంటి కష్టాలు ఉండవని పురాణాల ద్వారా తెలుస్తుంది. అమ్మవారిని రోజు ఒక్కొక్క అలంకారంలో పూజించి
 రోజుకొక నైవేద్యం చొప్పున సమర్పించడం చాలా  మంచిదని పండితులు చెబుతున్నారు.  కలశ స్థాపనాదులతో పూజించలేని వారు, అమ్మవారి పటానికి గాని, విగ్రహానికి గాని, పుస్తకాలను గాని పూజిస్తూ స్తోత్ర, నామ పారాయణలను చేసినా అలాంటి ఫలితమే కలుగుతుంది.

దసరా ఉత్సవాలు 9 రోజులు  ఆ తల్లిని ఆరాధించడం వల్ల ఆ దేవి సంతృప్తి చెంది దుష్ట, గ్రహ పీడలు నశించి అమ్మవారి కృప కటాక్షలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.  ఆశ్వయుజ మాసంలో  సప్తమి రోజున గోపూజ చేయాలని పండితులు చెబుతున్నారు.  ఆరోజు ఉపవాస దీక్షను పాటించాలి. ఇక  పూర్ణిమ నాడు  "నారదీయ పురాణము" ను పండితులకు తాంబూలములో వుంచి దానంగా ఇవ్వాలి. ఆ రోజు మహిళలు  జాగరణ చెయ్యటం వలన లక్ష్మిదేవి సంతోషించి, అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుంది శాస్త్రాల ద్వారా తెలుస్తుంది.

ఆశ్వయుజ మాసంలోని బహుళ పక్షములో చతుర్దశి, అమావాస్య తిధులలో దేవాలయ ప్రాంగణంలో దీపారాధాన చేయాలి. ఇంటి ఎదుట సాయంత్రము సమయములో  దీపారాధన చేయడం వలన పితృదేవతలు సంతృప్తి చెందుతారని పురాణాల ద్వారా తెలుస్తుంది. 

ఆశ్వయుజ  మాసం లో చేసే పూజలు ఆచారాల వలన  అనంతమైన పుణ్య ఫలాలు కలుగుతాయి.   భక్తులను ఎట్టి పరిస్థితులలో విడవకుండా కాపాడే కల్పవల్లి  కరుణామయి..ఆ తల్లి.. అనంత రూపాలలో విలసిల్లే శక్తిస్వరూపిణి అయిన  తల్లి అమ్మలగన్న అమ్మ ను  ఏ రూపములోనైనా, ఏ నామంతోనైనా ఆరాధించవచ్చని పండితులు చెబుతున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.