శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో దసరా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలకు ఆలయ చైర్మన్ అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీకారం చుట్టారు. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
తొలిసారిగా 93 మంది పండితులతో మహాయాగం
ఈ ఏడాది తొలిసారిగా రాష్ట్రంలోని నిష్ణాతులైన 93 మంది పండితులతో సహస్ర చండీ పారాయణ సహిత శతచండీ మహారుద్రయాగం నిర్వహించనున్నారు. లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ దసరా మహోత్సవాల్లో భాగంగా ఈ ప్రత్యేక యాగానికి ఏర్పాట్లు చేశారు.
ఉత్సవాల ప్రారంభ సందర్భంగా ముందుగా గణపతి పూజ, శివసంకల్పం, చండీశ్వర పూజ, కంకణధారణ, అఖండ దీపారాధన, వాస్తు పూజ, హోమం తదితర క్రతువులను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
తొమ్మిది రోజులపాటు అమ్మవారి ప్రత్యేక అలంకరణలు
దసరా ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజులపాటు ప్రతిరోజూ సాయంత్రం శ్రీభ్రమరాంబికా అమ్మవారు వివిధ అలంకరణల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అలాగే శ్రీశైల మల్లికార్జున స్వామి, భ్రమరాంబికా అమ్మవారు వివిధ వాహనసేవల్లో క్షేత్ర పురవీధుల్లో గ్రామోత్సవంగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఉత్సవాల మొదటి రోజైన ఆదివారం సాయంత్రం అమ్మవారు శైలపుత్రి అలంకరణలో దర్శనమివ్వనుండగా, స్వామి, అమ్మవార్లు భృంగి వాహనంపై విహరిస్తూ భక్తులను దర్శనమివ్వనున్నారు. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
