నెలలో రెండు సార్లు చోరీ..నాగారంలో ఒకే షాపును టార్గెట్ చేసిన దొంగ

 నెలలో రెండు సార్లు చోరీ..నాగారంలో ఒకే షాపును టార్గెట్ చేసిన దొంగ

మేడ్చల్ జిల్లా: ఒకే దుకాణాన్ని లక్ష్యంగా చేసుకున్న దొంగ రెండుసార్లు కన్నం వేసి సుమారు రూ.6 లక్షల విలువైన సామగ్రిని ఎత్తుకెళ్లిన ఘటన కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నాగారం మారుతీనగర్‌లోని శ్రీరామ ఎలక్ట్రికల్, పెయింట్ అండ్ శానిటరీ షాపులో ఈ చోరీలు జరిగాయి.

షాపు యజమాని ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్  21న దుకాణంలో చోరీ జరగడంతో సుమారు రూ.1.50 లక్షల విలువైన సామగ్రి అపహరణకు గురైంది. ఈ ఘటన మరువకముందే ఆదివారం తెల్లవారుజామున మరోసారి దొంగతనం జరిగింది. ఈసారి సుమారు రూ.4.50 లక్షల విలువైన ఎలక్ట్రికల్, ఇతర సామగ్రి మాయమైనట్లు యజమాని చెప్పారు. దీంతో రెండు ఘటనల్లో కలిపి సుమారు రూ.6 లక్షల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రెండు చోరీల వెనుక ఒకే వ్యక్తి ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేసిన యజమాని ప్రవీణ్.. ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ కాపీ, సీసీటీవీ ఫుటేజ్ అందుబాటులో ఉన్నప్పటికీ దర్యాప్తులో ఆశించిన పురోగతి కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నిందితుడిని త్వరగా గుర్తించి, చోరీకి గురైన సామగ్రిని తిరిగి రికవరీ చేయాలని పోలీసులను కోరారు.

ఈ ఘటనపై కీసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వరుసగా ఒకే దుకాణంలో చోరీలు జరగడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. నిందితుడిని గుర్తించి చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవాలని బాధితుడు కోరుతున్నారు.