నేపాల్‌లో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. గోర్ఖా జిల్లాలోని బుధి గండకి నది పరివాహక ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున వరదలు రావడంతో 10 మంది గల్లంతయ్యారు. వరద నీటి ఉద్ధృతికి ఆరు సస్పెన్షన్ బ్రిడ్జిలు, స్టీల్ బ్రిడ్జిలు ధ్వంసమయ్యాయి.చుమ్నుబ్రి మున్సిపాలిటిలో40కి పైగా ఇళ్లు కొట్టుకుపోయాయి. సల్లెరి బజార్, పయున్, జగత్, బగర్, ఘట్టిఖోలా వంటి ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. సల్లెరి వద్ద నిర్మాణంలో ఉన్న 341 మెగావాట్ల బుధి గండ్కీ జలవిద్యుత్ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ క్యాంప్, యంత్రాలు దెబ్బతిన్నాయి. ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.
వరద బాధితులను ఆదుకునేందుకు జాతీయ విపత్తు నివారణ, నిర్వహణ సంస్థ (NDRRMA) రంగంలోకి దించారు నదీ పరివాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
తెల్లవారుజామున ఒక్కసారిగా వరదలు
ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో గోర్ఖా జిల్లాలోని ఉత్తర ప్రాంతాలను వరదలు ముంచెత్తినట్లు అధికారులు తెలిపారు. బుధి గండకి నదిలో నీటిమట్టం పెరుగుతూ, తగ్గుతూ ఉండటంతో ప్రజలను అప్రమత్తం చేశారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సహాయక, రక్షణ చర్యల కోసం భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు.
ఆరు వంతెనలు ధ్వంసం
వరదల కారణంగా రెండు వాహనాల వంతెనలు, నాలుగు వేలాడే వంతెనలు సహా మొత్తం ఆరు వంతెనలు దెబ్బతిన్నాయి లేదా కొట్టుకుపోయాయి. దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చుమ్నుబ్రి గ్రామీణ మున్సిపాలిటీలోని పైన్యు, బాగర్ ప్రాంతాల్లో సుమారు 35 ఇళ్లు కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. జగత్, సల్లేరి, దోవన్, ఘట్టేఖోలా ప్రాంతాల్లోనూ ఇళ్లు, స్థానిక మార్కెట్లు దెబ్బతిన్నాయి.
వరదలు వస్తున్న సమయంలో నదీ తీర ప్రాంతాల్లో పెద్ద శబ్దాలు వినిపించడంతో స్థానికులు పరుగులు పెట్టారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. అక్కడి హోటళ్లలో ఉన్న పర్యాటకులు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.
రంగంలోకి నేపాల్ సైన్యం
వరద బాధితులను కాపాడేందుకు నేపాల్ సైన్యం సహాయక చర్యలు చేపట్టింది. గాలింపు, సహాయక చర్యల కోసం హెలికాప్టర్లను సిద్ధం చేశారు. కాఠ్మండు నుంచి ప్రత్యేక బృందాన్ని ప్రభావిత ప్రాంతానికి తరలించారు. ఆరుగురిని సైన్యం సురక్షిత ప్రాంతాలకు చేర్చింది.
వరదల పెరిగే అవకాశం ఉండటంతో నదీ తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరించారు. వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. గతంలోనూ నేపాల్‌లో భారీ వరదలు ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించాయి. తాజా ఘటనతో మరోసారి నదీ పరివాహక ప్రాంతాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Nepal's National Disaster Risk Reduction and Management Authority tweets, "A large flood is coming from Chumanuwmi Rural Municipality-6 of the Budhi Gandaki River, so until the flood passes, do not go near the river up to Trishuli Dobhan. Stay in high places." (Source: Nepal Army)
— ANI (@ANI) October 11, 2026
