రాజకీయం చేయాలనుకుంటే నేరుగా పార్టీ పెట్టండి: సీజేపీపై కేంద్ర మంత్రి జోషి ఫైర్

రాజకీయం చేయాలనుకుంటే నేరుగా పార్టీ పెట్టండి: సీజేపీపై కేంద్ర మంత్రి జోషి ఫైర్

న్యూఢిల్లీ: సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో అరాచకం సృష్టించడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఒకవేళ కాక్రోచ్ జనతా పార్టీ రాజకీయాల్లోకి రావాలనుకుంటే నేరుగా ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాలన్నారు. దేశ ప్రధాని, హోం మంత్రి, ఎన్నికల సంఘాన్ని దూషించడం ప్రజాస్వామ్యానికి సరికాదని.. అది మన సంస్కృతిలో భాగం కూడా కాదని పేర్కొన్నారు.

సీజేపీ నిరసన ఫ్లాప్ షో: బీజేపీ

దేశ రాజధానిలో అరాచకం సృష్టించాలనే ఉద్దేశంతో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసన ఫ్లాప్ అయ్యిందని బీజేపీ ఎద్దేవా చేసింది. జంతర్ మంతర్ వద్దకు వెళ్లిన వందలాది మంది యువకులను, పలువురు రాజకీయ నాయకులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఇది మూక పాలనపై ప్రజాస్వామ్యం సాధించిన విజయమని పేర్కొంది. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విదేశీ శక్తులతో కుమ్మక్కై అరాచకాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించింది. 

ఈ సందర్భంగా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లపైనా బీజేపీ నేత సంబిత్ పాత్రా విమర్శలు గుప్పించారు. సీఈసీకి వ్యతిరేకంగా, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ సాగుతున్న పోరాటానికి నాయకత్వం వహించిన ఘనతను దక్కించుకునేందుకు రెండు పార్టీలు పోటీ పడుతున్నాయని ఆరోపించారు. అరాచక శక్తుల మధ్యే అంతర్గత అరాచకం నెలకొందని వ్యాఖ్యానిస్తూ, కాంగ్రెస్, ఆప్ పార్టీ మధ్య రాజకీయ ఆధిపత్య పోరును ఎత్తిచూపారు.