దసరా నవరాత్రి ఉత్సవాలు దగ్గర పడుతున్న వేళ సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు నిత్యావసరాల ధరల మోత షాకిస్తోంది. రిటైల్ మార్కెట్లలో సన్నబియ్యం ధరలు ఒక్కసారిగా దూసుకెళ్లి కిలో రూ.85 నుంచి రూ.90 వరకు పలుకుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే కొన్ని రోజుల్లోనే సన్నబియ్యం ధర కేజీకి రూ.100 మార్కును తాకే అవకాశం ఉందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పండగ పూట కిచెన్ బడ్జెట్ తలకిందులు అవుతుండటంతో ఫ్యామిలీస్ తీవ్ర ఆందోళన చెందుతున్నాయి.
గడిచిన 30 నుంచి 45 రోజుల వ్యవధిలోనే 25 కిలోల సన్నబియ్యం బస్తా ధర రూ.300 నుంచి రూ.500 వరకు పెరిగింది. రకం ఆధారంగా చూస్తే.. గతంలో సుమారు రూ.1,500 ఉన్న 25 కిలోల ముడి బియ్యం బస్తా ప్రస్తుతం రూ.1,900 వరకు అమ్ముతున్నారు. అలాగే రూ.1,600 పలికిన స్టీమ్ రైస్ బస్తా ఇప్పుడు రూ.2,100కి చేరింది. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని.. రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు.
కొద్ది నెలల క్రితం వరకు రైస్ మిల్లుల సూపర్‌వైజర్లు నేరుగా వ్యాపారులకు ఫోన్ చేసి ఆర్డర్లు కోరేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. డిమాండ్ విపరీతంగా పెరగడంతో మిల్లుల నుంచి సరుకు సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతోందని వ్యాపారులు వాపోతున్నారు. ముఖ్యంగా తెలంగాణలోని నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం తదితర ఉమ్మడి జిల్లాల్లో పండించే సన్నబియ్యానికి ఇతర రాష్ట్రాల్లో భారీ డిమాండ్ ఉండటంతో పక్క రాష్ట్రాల బ్రోకర్లు లారీల కొద్దీ స్టాక్ అడ్వాన్సులు చెల్లించి బుక్కింగ్ చేసుకుంటున్నారు.
ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల వ్యాపారులు తెలంగాణలోని రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేయడానికి పోటీ పడుతున్నారు. పొరుగు రాష్ట్రాల వ్యాపారులు పెద్దఎత్తున ప్రొక్యూర్మెంట్ ప్రారంభించడం వల్ల స్థానిక మార్కెట్లకు రావలసిన బియ్యం సరఫరా తగ్గిపోయింది. దీనికి తోడు ఈ వానాకాలం సీజన్‌లో సాగు విస్తీర్ణం భారీగా తగ్గడం ధరల పెరుగుదలకు మరో ప్రధాన కారణమైంది. గత ఏడాది వానాకాలంలో దాదాపు 92 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగగా.. ఈ ఏడాది ఆ విస్తీర్ణం 78.23 లక్షల ఎకరాలకు పడిపోయింది.
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా భారీగా సన్నబియ్యం నిల్వలను తన వద్దే ఉంచుకుంటోంది. ఈ పరిణామాల మధ్య దసరా, దీపావళి పండుగల సీజన్‌లో ధరలు మరింత భగ్గుమనే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బియ్యం ధరలు ఈ విధంగా అకస్మాత్తుగా పెరగడంపై ఆందోళన వ్యక్తమవుతున్నప్పటికీ.. రాబోయే రోజుల్లో ధరలు స్థిరపడతాయని రైస్ మిల్లర్ల సంఘం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
కొత్త వానాకాలం సీజన్ ధాన్యం మార్కెట్లకు వస్తే ధరలు కొంతవరకు అదుపులోకి వస్తాయని మిల్లర్లు చెబుతున్నారు. అయితే ఎల్ నినో ప్రభావం కారణంగా యాసంగి సీజన్ వరి సాగు, ఉత్పత్తి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని వారు అంటున్నారు. మొత్తంగా చూస్తే బియ్యం ధరల పరిస్థితి రాబోయే సీజన్‌లో మార్కెట్లకు వచ్చే ధాన్యం నిల్వలపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టమవుతోంది.
