ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు.. పూల పండుగతో సందడిగా వీధులు

ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు.. పూల పండుగతో సందడిగా  వీధులు

హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను మహిళలు ఉత్సాహంగా జరుపుకున్నారు. తీరొక్క రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, వాటి చుట్టూ చేరి సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ఆడిపాడారు. దీంతో వీధులు, ఆలయాల ప్రాంగణాలు పండుగ శోభను సంతరించుకున్నాయి.

రవీంద్రభారతిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. డప్పు వాయిద్యాలు, కోలాట కళాకారుల ప్రదర్శనల నడుమ పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెలక్క, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి హాజరయ్యారు.మంత్రులు దీపప్రజ్వలన చేసి బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా యావత్ తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రవీంద్రభారతి ప్రాంగణంలో మహిళలు నిర్వహించిన బతుకమ్మ ఆటపాటలను వీక్షించారు.

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఆంజనేయస్వామి ఆలయం వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సందడి చేశారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు, ప్రకృతితో మమేకమైన జీవనశైలికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

నిమజ్జనానికి ఏర్పాట్లు

బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, కుంటల వద్ద బతుకమ్మల నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ పూల పండుగలో మహిళలు, యువతులు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ సంబరాలు జరుపుకోనున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పండుగ రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. పూలతో ప్రకృతిని ఆరాధిస్తూ, సంప్రదాయాలను భావితరాలకు అందించే ఈ వేడుకలు తెలంగాణ ప్రత్యేకతను మరోసారి చాటిచెబుతున్నాయి.