Shreyas Iyer: భారత టీ20 జట్టు నాయకత్వ బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తున్న కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) పై న్యూజిలాండ్ స్టార్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ (Lockie Ferguson) ప్రశంసల వర్షం కురిపించాడు. అక్టోబర్ 22వ తేదీ నుంచి టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. శ్రేయస్ ప్రశాంతంగా, క్లియర్ కమ్యూనికేషన్ తో, ఆటగాళ్లపై అతనికి ఉన్న నమ్మకాన్ని ఫెర్గూసన్ ప్రత్యేకంగా కొనియాడాడు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) తరఫున శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో ఆడిన అనుభవాన్ని పంచుకుంటూ, అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను నడిపించే సత్తా అతనికి పూర్తిగా ఉందన్నాడు.
శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ అద్భుతం: లాకీ ఫెర్గూసన్
సోనీ స్పోర్ట్స్ నిర్వహించిన ఇంటరాక్షన్ కార్యక్రమంలో లాకీ ఫెర్గూసన్ మాట్లాడుతూ.. T20 క్రికెట్‌లో మ్యాచ్ గమనం వేగంగా మారే సమయంలో కెప్టెన్‌కు ప్రశాంతత (Composure) చాలా అవసరమని, శ్రేయస్‌లో ఆ లక్షణం ఎక్కువగా ఉందన్నారు. శ్రేయస్ ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛనిస్తాడు.. ప్లానింగ్ విషయంలో చాలా క్లారిటీ ఉంటుంది. మ్యాచ్ మంచిగా సాగుతున్నా, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా ప్లేయర్స్ కు మద్దతుగా నిలుస్తాడని అతడు పేర్కొన్నాడు. భారత క్రికెట్‌లోని భారీ అంచనాల ఒత్తిడిని చాలా సులువుగా తట్టుకుంటూ జట్టును నడిపిస్తున్న శ్రేయస్, టీమిండియా కెప్టెన్ కావడం తనకు ఏమాత్రం ఆశ్చర్యాన్ని కలిగించలేదని ఫెర్గూసన్ తెలిపాడు.
టీమిండియా ఫియర్‌లెస్ బ్యాటింగ్ పై ప్రశంసలు:
2024 టీ20 ప్రపంచకప్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ.. భారత్ రూపొందించిన కొత్త బ్యాటింగ్ లైనప్ ఎంతో శక్తివంతంగా ఉందని లాకీ ఫెర్గూసన్ అభిప్రాయపడ్డాడు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, తిలక్ వర్మ వంటి యువ ఆటగాళ్లతో భారత బ్యాటింగ్ లైనప్ ఫియర్‌లెస్ (Fearless) క్రికెట్ ఆడుతోందని మెచ్చుకున్నాడు. జట్టులో చోటు కోసం తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ యువ ఆటగాళ్లు మరింత స్వేచ్ఛగా రాణించేలా చేస్తోందని, ఐపీఎల్ (IPL) ద్వారా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను త్వరగా నేర్చుకుంటున్నారని పేర్కొన్నాడు.
వైభవ్ సూర్యవంశీ టాలెంట్‌పై కామెంట్స్
భారత జట్టులోకి ఎంపికైన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) బ్యాటింగ్ నైపుణ్యాన్ని కూడా కివీస్ స్టార్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ ప్రశంసించాడు. ఐపీఎల్‌లోనే వైభవ్ సత్తాను చూశానని, అతనిలో అద్భుతమైన ప్రతిభ దాగి ఉందని పేర్కొన్నాడు. రాబోయే న్యూజిలాండ్ పర్యటన యువ ఆటగాడు వైభవ్‌కు విదేశీ పరిస్థితులకు, డిఫరెంట్ పిచ్‌లకు అలవాటు పడేందుకు ఒక గొప్ప అవకాశమని లాకీ అభిప్రాయపడ్డాడు.
