ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ స్మార్ట్ టీవీలు, ఎల్ఈడీ స్క్రీన్లు కామన్ అయిపోయాయి. కానీ మన దేశంలో 1960వ దశకంలో టెలివిజన్ ప్రసారాలు అడుగుపెట్టగా, 1982 నాటికి కలర్ టివి ప్రసారాలు ప్రారంభమయ్యాయి. అయితే, భారతదేశంలో తయారైన మొట్టమొదటి కమర్షియల్ టెలివిజన్ ఏది ? దానిని ఏ కంపెనీ తయారు చేసింది ? అంటే చాలామంది crown, onida, bpl అని అనుకుంటారు.
కానీ, మనదేశంలో మొట్టమొదటి టీవీని తయారు చేసిన ఘనత ఒక విదేశీ కంపెనీకి కాదు... మన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కి చెందిన ఒక భారతీయ కంపెనీకి దక్కుతుంది.
కాన్పూర్ లో పుట్టిన దేశపు తొలి టీవీ
భారతదేశంలో వాణిజ్యపరంగా టీవీలను ఉత్పత్తి చేసి, మార్కెట్లోకి తెచ్చిన మొట్టమొదటి ప్రైవేట్ సంస్థ 'జేకే ఎలక్ట్రానిక్స్' (JK Electronics). ప్రముఖ సింఘానియా గ్రూప్‌కు చెందిన ఈ కాన్పూర్ సంస్థ, 1969లో 'జేకే టీవీ' (JK TV) పేరుతో మనదేశపు తొలి స్వదేశీ బ్లాక్ అండ్ వైట్ టీవీని మార్కెట్లోకి విడుదల చేసింది.
టీవీ టెక్నాలజీ ఎలా వచ్చింది?
1960వ దశకంలో రాజస్థాన్‌లోని పిలానీలో ఉన్న ప్రభుత్వ పరిశోధనా సంస్థ 'సీఈఈఆర్ఐ' (CEERI - Central Electronics Engineering Research Institute) భారతదేశపు తొలి టీవీ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఈ టెక్నాలజీని ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి టీవీలు తయారు చేయాల్సిందిగా ప్రభుత్వం కోరింది. అప్పట్లో జేకే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిరాడ్ కంపెనీలకు లైసెన్సులు లభించాయి. అందరికంటే ముందే టీవీల తయారీ పూర్తి చేసి, 1969లో మార్కెట్లోకి సక్సెస్ ఫుల్ గా లాంచ్ చేసిన రికార్డు జేకే ఎలక్ట్రానిక్స్ దక్కించుకుంది.
తొలి 'కలర్ టీవీ' ఎవరు తెచ్చారో తెలుసా?
మొట్టమొదటి బ్లాక్ అండ్ వైట్ టీవీని 'జేకే ఎలక్ట్రానిక్స్' తయారు చేస్తే, భారతదేశపు మొట్టమొదటి కలర్ టీవీని మార్కెట్‌కి పరిచయం చేసిన ఘనత 'వెస్టన్' (Weston) కంపెనీకి చెందుతుంది. వెస్టన్ సంస్థ 1967 నుంచే బ్లాక్ అండ్ వైట్ టీవీలను తయారు చేస్తున్నప్పటికీ, భారతదేశంలో కలర్ టీవీ యుగాన్ని ప్రారంభించిన బ్రాండ్‌గా చరిత్రలో నిలిచిపోయింది.
ALSO READ : మీ ఇంట్లో కుక్క లేదా పిల్లి ఉందా ? 5 కోట్ల వరకు చికిత్స ఫ్రీ.
ఒకప్పటి పాపులర్ టీవీ బ్రాండ్లు:
1969లో జేకే టీవీ వచ్చాక, 70లు & 80ల నాటికి మనదేశంలో చాలా టీవీ కంపెనీలు వచ్చాయి. అప్పట్లో 'క్రౌన్' (Crown) టీవీలు అత్యధికంగా అమ్ముడవుతూ మొదటి స్థానంలో నిలిచాయి. అలాగే 'డయాన్యోరా' (Dyanora) టీవీలు కూడా ఆ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ మంచి పేరును పొందాయి.
మనదేశ పారిశ్రామిక చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జేకే గ్రూప్ (కాన్పూర్), నాటి సాంకేతిక విప్లవానికి వేసిన ఈ అడుగు భారతీయ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఒక సంచలన చరిత్రగా నిలిచిపోయింది!
