ట్రంప్ గ్రీన్ కార్డ్ రూల్స్‌తో కొత్త జాబ్స్ ట్రెండ్.. స్వదేశంలోనే టెక్కీలకు అవకాశాలు

ట్రంప్ గ్రీన్ కార్డ్ రూల్స్‌తో కొత్త జాబ్స్ ట్రెండ్.. స్వదేశంలోనే టెక్కీలకు అవకాశాలు

ఇమ్మిగ్రెంట్లపై అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు భారత ఐటీ రంగానికి ఊహించని వంగా మారుస్తున్నాయి. ప్రముఖ టెక్ కంపెనీల్లో గ్రీన్‌కార్డ్ జారీ ప్రక్రియపై ఆంక్షలు విధించే దిశగా అమెరికా అడుగులు వేస్తుండటంతో.. అక్కడ పనిచేయాలనుకునే భారతీయ సాఫ్ట్‌వేర్ నిపుణులకు వీసా ఇబ్బందులు తీవ్రతరం కానున్నాయి. దీంతో విదేశీ గడ్డపై ఉద్యోగ అవకాశాలు మందగించినప్పటికీ.. స్వదేశంలోనే టెక్‌ జాబ్స్ హైరింగ్ సునామీ స్టార్ట్ అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికాలోని కార్యాలయాల కోసం ఇండియా నుంచే పనిచేయాలనుకునే ఇంజినీర్లకు ఇది సువర్ణావకాశం.

విదేశీ వీసా నిబంధనలు కఠినతరం కావడం వల్ల అంతర్జాతీయ సంస్థలు తమ కార్యకలాపాలను భారత్ వంటి దేశాల్లో విస్తరించేందుకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఇప్పటికే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు భారత్‌లో తమ వేళ్లను మరింత లోతుగా నాటుతున్నాయి. అమెరికాలో శాశ్వత నివాస అనుమతులు నిరాకరణతో అక్కడి టెకీలు భారత్‌లోని ప్రధాన నగరాలైన బెంగళూరు, హైదరాబాద్, పూణే నగరాల వైపు చూసే అవకాశం ఉంది. 

ట్రంప్ సర్కార్ తీసుకొస్తున్న అమెరికా గ్రీన్‌కార్డ్ ఆంక్షలు భారత్‌కు కేవలం సవాళ్లను మాత్రమే కాకుండా, అద్భుతమైన అవకాశాలను కూడా తెచ్చిపెడుతున్నాయి. భారతీయ టెక్ పరిశ్రమ ఇప్పటికే అత్యున్నత ప్రమాణాలతో దూసుకుపోతున్న తరుణంలో.. ఈ పరిణామాలు దేశీయ జాబ్ మార్కెట్‌ను మరింత బలపరుస్తాయి. విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే స్థానికంగానే అంతర్జాతీయ స్థాయి వేతనాలు, ఉద్యోగ భద్రత లభించడం భారతీయ ఇంజినీర్లకు పెద్ద ఊరటనిస్తుందనేది నిపుణుల మాట. చూడాలి ఎలాంటి మార్పులు వస్తాయనేది.