దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన ఉపఎన్నికల ఫలితాలు 2026 అక్టోబర్ 9న (శుక్రవారం) వెలువడ్డాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, పుదుచ్చేరిలోని ఐదు అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ సీటుకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ, తమిళగ వెట్టి కజగం (టీవీకే), ఆల్ ఇండియా ఎన్.ఆర్. కాంగ్రెస్ (ఏఐఎన్‌ఆర్‌సీ) పార్టీలు విజయం సాధించాయి.
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ:
పశ్చిమ బెంగాల్ లో రెండు స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. అందులో రెండింటినీ బీజేపీ గులుచుకుంది. నందీగ్రామ్ అసెంబ్లీ సీటులో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్ లక్షా 64 వేల 427 ఓట్లు సాధించి కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌పై ఘన విజయం సాధించారు. రెజీనగర్ సీటులో కూడా బీజేపీ అభ్యర్థి శంఖరావ్ సర్కార్ లక్షా29 వేల 914 ఓట్లు పొంది ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ (ఏజేయూపీ) అభ్యర్థి గోలామ్ నబీ ఆజాద్‌పై 75 వేల 816 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
తమిళనాడులో టీవీకేకు రెండు సీట్లు
తమిళనాడులో మదురంతకం, ధారాపురం సీట్లపై సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే అభ్యర్థులు విజయం సాధించారు. మదురంతకంలో కె. మారగతం కుమారవేల్ 74 వేల 48 ఓట్లు సాధించి డీఎంకే అభ్యర్థి ఐ. పరంతమన్‌పై 20 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలిచారు. ధారాపురంలో పి. సత్యభామ 66 వేల 841 ఓట్లు పొంది డీఎంకే అభ్యర్థి ఎస్. సుగన్యపై 9 వేల 471 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇది రాష్ట్రంలో టీవీకే ప్రభుత్వానికి బలమైన మద్దతు అని చెబుతున్నారు. పాలనకు రెఫరాండం అంటూ చెప్పుకొచ్చిన విజయ్.. ప్రజల నుంచి సానుకూలత సాధించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
పుదుచ్చేరిలో ఏఐఎన్‌ఆర్‌సీ విజయం
పుదుచ్చేరిలోని తట్టంచావడి అసెంబ్లీ సీటులో ఏఐఎన్‌ఆర్‌సీ అభ్యర్థి అశోక్ ఆనంద్ 13 వేల 358 ఓట్లు సాధించి కాంగ్రెస్ అభ్యర్థి ఈ. వినయగమ్‌పై 8 వేల 482 ఓట్ల తేడాతో గెలుపొందారు.
అసోంలో లోక్‌సభ సీటు గెలిచిన బీజేపీ
అసోంలోని నాగావ్ లోక్‌సభ సీటులో బీజేపీ అభ్యర్థి దేవాశీష్ శర్మ భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆయన ఏఐయూడీఎఫ్ నేత బద్రుద్దీన్ అజ్మల్‌పై ఆధిక్యం సాధించారు.
దేశ వ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికలలో మొత్తం ఆరు సీట్లలో బీజేపీ మూడు (రెండు అసెంబ్లీ, ఒక లోక్‌సభ), టీవీకే రెండు, ఏఐఎన్‌ఆర్‌సీ ఒక సీటు గెలుచుకున్నాయి. ఈ ఫలితాలు సంబంధిత రాష్ట్రాల్లో అధికార పార్టీలకు ఊతం ఇచ్చినట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
