సాంకేతికత ఎంత ఆధునికమైనప్పటికీ.. మనుషుల మనస్తత్వంలోని పక్షపాతాలు ఇంకా మారలేదనడానికి AIపై ఇటీవల జరిగిన ఓ రీసెర్చ్ అద్దం పడుతోంది. మనుషుల మధ్యే కాదు.. ఏఐ అసిస్టెంట్లతో వ్యవహరించడంలోనూ లింగ వివక్ష స్పష్టంగా కనిపిస్తోందని అధ్యయనం నిరూపించింది. సాంకేతిక సామర్థ్యాలు ఒకేలా ఉన్నప్పటికీ, పురుష రూపంలో ఉన్న ఏఐ అసిస్టెంట్లతో పోలిస్తే మహిళ రూపంలో ఉన్న ఏఐ అసిస్టెంట్లకు మనుషులు తక్కువ పేమెంట్ ఇస్తున్నట్లు ఈ పరిశోధన ద్వారా వెల్లడైంది.
ఐర్లాండ్‌లోని లిమెరిక్ విశ్వవిద్యాలయానికి చెందిన కెమ్మీ బిజినెస్ స్కూల్ పరిశోధకులు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. వర్చువల్ రియాలిటీ ఆఫీస్‌లో 189 మంది ఉద్యోగులను ఉంచి ఈ పరిశోధన చేపట్టారు. టెక్స్ట్-బేస్డ్ చాట్‌బాట్, డెస్క్ రోబోట్, జోహన్ (మగ ఏఐ), జోహన్న (ఆడ ఏఐ) అనే ఇద్దరు మనుషుల పోలికలున్న ఏఐ ఏజెంట్లను ఈ ప్రయోగంలో ఉపయోగించారు. ఈ అసిస్టెంట్లన్నింటికీ ఒకే రకమైన ప్రోగ్రామింగ్, సమాన సామర్థ్యాలను కల్పించారు. పాల్గొన్న ఉద్యోగులకు డబ్బును ఇచ్చి.. తాము చేసిన పనులకు సహాయపడిన ఏఐ అసిస్టెంట్లకు ఆ డబ్బును పంచాలని కోరారు.
ఈ ప్రయోగంలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. జోహన్ (మగ ఏఐ)తో సమానమైన పనులు చేసినప్పటికీ, జోహన్న (ఆడ ఏఐ)కి సగటున 10.25 శాతం తక్కువ డబ్బు వచ్చాయి. అంతేకాకుండా.. పురుష రూపంలో ఉన్న అసిస్టెంట్‌ను ఎక్కువ మంది మనిషిలాగా భావించడం విశేషం. లింగభేదం తమ నిర్ణయాలపై ప్రభావం చూపదని కొందరు పాల్గొనేవారు చెప్పినప్పటికీ, ఆచరణలో మాత్రం జోహన్‌కే ఎక్కువ మొత్తంలో డబ్బును చెల్లించారు. టెక్నాలజీని వాడినంత మాత్రాన మనుషులలోని పక్షపాతాలు, మూస పద్ధతులు అంతం కావని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది.
ఈ పరిశోధన ఫలితాలు భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. ఏఐ అసిస్టెంట్లు కార్యాలయాల్లో సర్వసాధారణమవుతున్న తరుణంలో, వాటి డిజైన్ మరియు రూపకల్పన సామాజిక అసమానతలను మరింత పెంచే ప్రమాదం ఉందని డాక్టర్ మేరీ హౌస్‌ఫెల్డ్ హెచ్చరించారు. సాంకేతికతను అభివృద్ధి చేసేటప్పుడు, వాటి లక్షణాలు మానవ సమాజంలో ఎలాంటి ప్రవర్తనలను ప్రోత్సహిస్తున్నాయనే దానిపై కంపెనీలు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే.. మనుషుల్లోని పక్షపాతాలు డిజిటల్ ప్రపంచంలోకి కూడా విస్తరించే ప్రమాదం ఉంది.
