టెలికాం రంగంలో స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీల మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతోంది. భారత్ లో 'స్టార్‌లింక్' శాటిలైట్ ఇంటర్నెట్ సేవల ప్రారంభం ఆలస్యం అవుతుండటంతో ఎలాన్ మస్క్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం వ్యాపారపరమైన పోటీ గురించే కాకుండా.. ఏకంగా రాజకీయ విరాళాలు, అధికార పార్టీతో రిలయన్స్ సంబంధాల అంశాలను తెరపైకి తెస్తూ సంచలన ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది.
భారత్‌లో స్టార్‌లింక్ ప్రవేశాన్ని కొందరు కుబేరులు కావాలనే అడ్డుకుంటున్నారని ఎలాన్ మస్క్ దీనికి ముందు మండిపడ్డారు. అయితే ఈ వివాదం మరింత తారాస్థాయికి చే చేరుకుంటూ.. సోషల్ మీడియా వేదికగా ముఖేష్ అంబానీని నేరుగా టార్గెట్ చేశారు మస్క్. "డియర్ ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. భారతదేశపు అసలు బాస్ మీరేనని గ్రహించలేకపోయినందుకు నా మన్నించమని కోరుతున్నాను" అంటూ మస్క్ చేసిన ఎద్దేవా వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీశాయి. మార్కెట్లో తమ గుత్తాధిపత్యాన్ని కాపాడుకోవడానికి, ఇతర పోటీదారులను దెబ్బతీయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారంటూ రిలయన్స్ జియోను నేరుగానే టార్గెట్ చేశారు మస్క్.
https://t.co/DJYynAyO0W
— Elon Musk (@elonmusk) October 10, 2026
ఈ వివాదం కేవలం వ్యాపార రంగానికి మాత్రమే పరిమితం కాలేదు. తన వాదనకు బలం చేకూర్చేలా మస్క్ సోషల్ మీడియాలో మరికొన్ని పాత నివేదికలను షేర్ చేశారు. రిలయన్స్-ఫండెడ్ సంస్థ ఫేస్‌బుక్ వేదికగా అధికార బీజేపీ ఎన్నికల ప్రచారానికి ఏ విధంగా సహకరించిందనే అంశంపై 2022లో అల్ జజీరా రిపోర్ట్‌ను మళ్లీ వెలుగులోకి తెచ్చారు. అలాగే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రిలయన్స్‌కు చెందిన 'క్విక్ సప్లై' సంస్థ బీజేపీకి రూ.385 కోట్లు, శివసేనకు రూ.25 కోట్లు విరాళాలు అందజేసిందంటూ వచ్చిన కథనాన్ని షేర్ చేయటం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.
స్టార్‌లింక్ ఎంట్రీ వివాదంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. భారత్‌లో ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించే ప్రసక్తే లేదని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. స్టార్‌లింక్‌తో పాటు రిలయన్స్ జియో శాటిలైట్ వెంచర్, భారతీ ఎయిర్‌టెల్ మద్దతు ఉన్న యూటెల్‌శాట్ వన్‌వెబ్ సంస్థలకు ఇప్పటికే శాటిలైట్ కమ్యూనికేషన్ లైసెన్స్‌లు జారీ చేశామని తెలిపారు. అయితే స్పెక్ట్రమ్ ధరల విధివిధానాలు ఖరారైన తర్వాత, జాతీయ భద్రతా ప్రమాణాలు తదితర నిబంధనలను పాటించిన కంపెనీలు మాత్రమే తమ సేవలను ప్రారంభించడానికి అర్హులని మోడీ ప్రభుత్వం తేల్చిచెప్పింది.
మొత్తానికి భారత్‌లో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్‌ను కైవసం చేసుకోవడానికి జరుగుతున్న ఈ పోటీలో.. టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ రాజకీయ కోణాలను, అధికార పార్టీ ఫండింగ్ అంశాలను తెరపైకి తెచ్చి కార్పొరేట్ రంగాన్ని కుదిపేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు, సెక్యూరిటీ క్లియరెన్స్‌ల పేరుతో స్టార్‌లింక్ ప్రవేశం ఆలస్యం అవుతుండగా.. మస్క్ చేస్తున్న ఈ వరుస విమర్శలు రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయనేది ఆసక్తికరంగా మారింది. నేరుగా ఒక భారత దిగ్గజ వ్యాపారవేత్తపై మస్క్ చేస్తున్న ఆరోపణలు అటు రాజకీయంగానూ ఇటు కార్పొరేట్ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారిపోయాయి.
