రాంపల్లి చౌరస్తా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెనుక నుంచి వస్తున్న గ్యాస్ లారీ స్కూటీని ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. శనివారం ( అక్టోబర్ 10 ) జరిగిన ఈ ఘటనలో కన్నతల్లి కళ్లెదుటే 20 ఏళ్ళ కొడుకు మృతిచెందడం అందరినీ కలిచివేస్తోంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...
కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లి చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.నాగారంకు చెందిన 20 ఏళ్ళ అఖిల్ ను వెనుక నుంచి గ్యాస్ లారీ ఢీకొట్టడంతో తీవ్ర ప్రమాదం జరిగి, అఖిల్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. చిన్న వయసులోనే కొడుకు మృత్యువాత పడటంతో అఖిల్ తల్లి బోరున విలపిస్తున్న తీరు హృదయవిదారకంగా మారింది.
ఘటన జరిగిన సమయంలో రాంపల్లి చౌరస్తా దగ్గర ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నట్లు తెలిపారు పోలీసులు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం గాలింపు చేపట్టారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు.
