తీపి పదార్థాల వల్ల మాత్రమే కాదు.. ఈ అలవాట్ల వల్ల కూడా 'షుగర్' వచ్చే ఛాన్స్ ఉంది!

తీపి పదార్థాల వల్ల మాత్రమే కాదు.. ఈ అలవాట్ల వల్ల కూడా 'షుగర్' వచ్చే ఛాన్స్ ఉంది!

ఈ రోజుల్లో మధుమేహం (డయాబెటిస్)  ఒక పెద్ద ముప్పుగా మారుతోంది. ప్రపంచంలోనే భారతదేశం "డయాబెటిస్ రాజధాని" గా మారుతుండటం అత్యంత ఆందోళన కలిగించే విషయం. కేవలం తీపి పదార్థాలు తినడం వల్లే డయాబెటిస్ వస్తుందని చాలామంది భావిస్తుంటారు. కానీ మన  జీవితంలోని కొన్ని చెడు అలవాట్లు, లైఫ్ స్టయిల్ వల్ల కూడా టైప్-2 డయాబెటిస్ బారిన పడే అవకాశం ఉంది.

భవిష్యత్తులో టైప్-2 డయాబెటిస్‌కు దారితీసే అలవాట్లు ఇవే:

 ప్యాక్ చేసిన ప్రాసెస్డ్ ఫుడ్స్  
మార్కెట్లో లభించే ప్యాక్ చేసిన & ప్రాసెస్ చేసిన ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల టైప్-2 డయాబెటిస్, డిప్రెషన్, క్యాన్సర్ వంటి  సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. 'నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్' నివేదిక ప్రకారం.. ప్యాక్ చేసిన ఫుడ్స్  మన డైట్‌లో 10% పెంచితే, డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఏకంగా 15% పెరుగుతుంది.

 టిఫిన్ మానేయడం
'ది జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్' అధ్యయనం ప్రకారం, ప్రతిరోజూ ఉదయం టిఫిన్ మానేసే అలవాటు ఉన్నవారికి భవిష్యత్తులో టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. మనం టిఫిన్  తినకపోవడం వల్ల శరీరంలోని కణాలు 'ఇన్సులిన్' హార్మోన్‌కు సరిగ్గా స్పందించే సామర్థ్యాన్ని కోల్పోతాయి, దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

 గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం
ప్రస్తుత కార్పొరేట్ ఉద్యోగాల్లో గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవడం సర్వసాధారణమైపోయింది. కానీ 30 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఒకే చోట కదలకుండా కూర్చోవడం వల్ల శరీరంలో శారీరక శ్రమ తగ్గి, టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం  పెరుగుతుంది. అందుకే ప్రతి 30 నిమిషాలకు ఒకసారి కాసేపు నడవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరం.

సరిపడా నిద్ర లేకపోవడం
'డయాబెటిస్ కేర్' జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. నిద్రలేకపోవడం లేదా అస్తవ్యస్తమైన నిద్ర వేళలు ఉన్నవారికి షుగర్ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజూ కనీసం 7 నుండి 8 గంటల గాఢనిద్ర శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను బ్యాలెన్స్ గా  ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

 ధూమపానం  చేయడం
'సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC)' ప్రకారం.. స్మోకింగ్ చేయనివారితో పోలిస్తే, ధూమపానం చేసేవారికి మధుమేహం వచ్చే ప్రమాదం 30% నుండి 40% వరకు ఎక్కువ. ధూమపానం శరీరంలో తీవ్ర ఒత్తిడిని పెంచి, ఇన్సులిన్ నిరోధకతకు (Insulin Resistance) దారితీస్తుంది.

 మధుమేహం బారిన పడకుండా ఉండాలంటే కేవలం స్వీట్లకు దూరంగా ఉండటం మాత్రమే సరిపోదు. మంచి ఆహార అలవాట్లు పాటించడం, ఉదయం టిఫిన్  తప్పక తినడం, రోజు  తప్పకుండా వ్యాయామం చేయడం, సరిపడా నిద్రపోవడం,  స్మోకింగ్‌కు దూరంగా ఉండటం ఎంతో ముఖ్యం.