Rohit Sharma: భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత నరకం చూపించిన క్షణాల్లో 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమి ఒకటి.. సొంతగడ్డపై వరుసగా 10 మ్యాచ్‌ల్లో ప్రత్యర్థులను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలై కోట్లాది మంది భారతీయుల కలలను భంగ్నం చేసుకుంది. ఆ ఘోర ఓటమిపై ఇండియన్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తాజాగా తన మనసులోని ఆవేదనను, ఆ ఓటమి అందించిన గుణపాఠాన్ని షేర్ చేసుకున్నాడు. తన టీవీ షో ఫ్యామిలీ ఫుల్ హౌస్ విత్ రోహిత్ శర్మ (Family Full House with Rohit Sharma) లో మాట్లాడిన హిట్ మ్యాన్.. ఆనాటి చేదు జ్ఞాపకాలు, ఆ తర్వాత టీ20 ప్రపంచకప్ 2024 విజయం వెనుక ఉన్న అసలు సీక్రెట్‌ను బయటపెట్టాడు.
19 ఏళ్ల కెరీర్‌లోనే అత్యంత కష్టమైన సమయం: రోహిత్ శర్మ
రోహిత్ శర్మ మాట్లాడుతూ.. 2023 నవంబర్ 19న ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ ఓటమి తన సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌లోనే అత్యంత కష్టమైన దశ అని పేర్కొన్నాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు 19 ఏళ్ల కాలంలో ఇలాంటి సమయాన్ని నేను ఎప్పుడూ చూడలేదు.. 2012 శ్రీలంక పర్యటనలో నేను ఘోరంగా విఫలమైనప్పుడు తీవ్రంగా ఫ్రస్ట్రేట్ అయ్యాను.. కానీ అది నా వ్యక్తిగత లక్ష్యం, కానీ నవంబర్ 19న జరిగింది నా ఒక్కడి లక్ష్యం కాదు, ఒక దేశం మొత్తం ప్రపంచకప్ కల నెరవేరాలని ఎదురుచూసిందని అతడు భావోద్వేగానికి గురయ్యాడు. టోర్నీ అంతటా తాము ఆడిన తీరు చూస్తే ఎక్కడా ఓడిపోతామని అనుకోలేదని, కానీ క్రీడలు నేర్పే గొప్ప పాఠం ఇదేనని రోహిత్ వ్యాఖ్యానించాడు.
నవంబర్ 19 ఓటమే 2024 టీ20 ప్రపంచకప్‌కు పునాది:
ఆనాటి పరాజయం జట్టును కుంగదీసినప్పటికీ, ఆటగాళ్లలో సరికొత్త కసిని, ఆకలిని పెంచిందని రోహిత్ శర్మ వెల్లడించారు. ఒకవేళ నవంబర్ 19వ తేదీన మేము ఆ ఓటమిని చవిచూడకపోతే.. 2024 టీ20 ప్రపంచకప్ గెలవాలనే కసి, ఆకలి మాలో ఉండేవి కావు.. విజయం కంటే వైఫల్యాలే మనిషికి ఎక్కువ పాఠాలు నేర్పుతాయని తెలిపాడు. వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జరిగిన 2024 టీ20 ప్రపంచకప్‌కు వెళ్లిన సమయంలో ఆటగాళ్లందరిలోనూ ఒక విభిన్నమైన ఎనర్జీ, ఎలాగైనా కప్ సాధించాలనే తపన కనిపించిందని గుర్తు చేసుకున్నారు.
ప్రతి నవంబర్ 19కి.. ఒక జూన్ 29 ఉంటుంది:
11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, జూన్ 29వ తేదీన బార్బడోస్ వేదికగా సౌతాఫ్రికాను ఓడించి భారత్ టీ20 ప్రపంచకప్ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ ప్రయాణాన్ని రోహిత్ శర్మ ఒక అద్భుతమైన కోట్‌తో ముగించారు. ప్రతి నవంబర్ 19కి పరిహారంగా కచ్చితంగా ఒక జూన్ 29 వస్తుందని (For every November 19, there is a June 29) వెల్లడించాడు. నవంబర్ 19 నాటి గాయం తీవ్రమైనదే అయినప్పటికీ.. మళ్లీ భారత్‌ను ప్రపంచ క్రికెట్ శిఖరాగ్రాన నిలబెట్టేందుకు ఆ ఓటమి ఒక బలమైన ఇంధనంగా పని చేసిందని రోహిత్ శర్మ తేల్చి చెప్పాడు.
