హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి. ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా ఆటపాటలతో సందడి చేశారు. మహిళల కోలాటాలు, బతుకమ్మ పాటలతో రవీంద్రభారతి ప్రాంగణం మార్మోగింది.
ఈ సందర్భంగా మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతి ప్రసాదించిన పూలను దేవతగా భావించి పూజించే అపురూపమైన పండుగ బతుకమ్మ అని వారు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల సామూహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసిపంచుకునే ఐక్యతా భావానికి ఈ పండుగ నిదర్శనమని అన్నారు.బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, మహిళల ఆత్మీయత, ప్రకృతితో ముడిపడిన జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుందని మంత్రులు తెలిపారు. ఈ పండుగ ప్రజల్లో సంతోషాన్ని, సోదరభావాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలని, ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మంత్రులు ఆకాంక్షించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి తెలంగాణ సుభిక్షంగా వర్ధిల్లాలని కోరుకున్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడంతోపాటు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ వేడుకలు మహిళల ఉత్సాహం, ఐక్యతను చాటిచెప్పాయి. పూల పండుగను పురస్కరించుకుని రవీంద్రభారతిలో నెలకొన్న సందడి పండుగ వాతావరణాన్ని మరింత శోభాయమానంగా మార్చింది.
