- కోల్ ఇండియాతో సర్కారు ఒప్పందం
- ఒడిశాలోని మహానది బొగ్గు గని నుంచి
- రోజుకు 14 వేల టన్నుల సరఫరా
- కరెంటు కొరత నివారణకు చర్యలు
హైదరాబాద్, వెలుగు: ఎల్ నినో నేపథ్యంలో రాష్ట్రంలో కరెంటు కొరత రాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు ఒడిశాలోని మహానది బొగ్గు గని నుంచి జీ9 రకం బొగ్గును తీసుకురానుంది. ఈ మేరకు కోల్ ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రోజుకు 14 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు రాష్ట్రానికి రానుంది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవడం ద్వారా కరెంటు కొరత నివారించాలని భావిస్తోంది. ఈ మేరకు కోల్ ఇండియా నుంచి ఏటా 5 మిలియన్ టన్నుల జీ 9, జీ 10 రకం బొగ్గు సరఫరాకు ఒప్పందం కుదిరింది. రోజుకు 14 వేల టన్నుల చొప్పున బొగ్గు సరఫరా చేయనున్నారు. దీనిపై ప్రాథమికంగా అగ్రిమెంట్ జరగ్గా త్వరలోనే ఉత్తర్వులు రానున్నాయి. మహానది కోల్సప్లై జరిగితే యాదాద్రి ప్లాంట్ కష్టాలు తీరుతాయి.
సింగరేణి నుంచి 5 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరా రద్దు
రాష్ట్రంలో ప్రాజెక్టులకు ఎక్కువ నాణ్యత ఉన్న జీ9, 10 బొగ్గే అవసరం ఉంటుంది. 500, 800 మెగావాట్ల సామర్థ్యం గల కేటీపీఎస్ 6, 7 ప్లాంట్లు, 4 వేల మెగావాట్ల సామర్థ్యం గల యాదాద్రిలోని వైటీపీఎస్ ప్లాంట్లలో జీ9, 10 బొగ్గు మాత్రమే వినియోగించాల్సిఉంటుంది.
రాష్ట్రంలో గనులు మూతపడటం, కొత్త గనుల రాకపోవడం, నైనీ బొగ్గుపై ఇతర రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకోవడం వల్ల సింగరేణి క్వాలిటీ బొగ్గు సరఫరా చేయలేకపోతున్నది. దీంతో ఈ యూనిట్లలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరగకపోవడంవల్ల లోడ్ ఫాక్టర్ పై ప్రభావం చూపిస్తోంది. నాణ్యత లేని బొగ్గు కారణంగా 2025-26 లో 4 వేల మిలియన్ యూనిట్ల కరెంట్ ఉత్పత్తి తగ్గింది. తద్వారా జెన్కో సంస్థకు రూ.2 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. వైటీపీఎస్‌లోని 3 యూనిట్లకు(2,400 మెగావాట్ల) మాత్రమే బొగ్గు సరఫరా చేయగలమని ఇదివరకే సింగరేణి జెన్కోకు తెలియచేసింది. మిగిలిన రెండు యూనిట్ల (1,600 మెగావాట్ల) కోసం కోల్ ఇండియా లిమిటెడ్ ద్వారా దీర్ఘకాలిక ప్రత్యామ్నాయ వనరుల నుంచి బొగ్గు సరఫరా చేసుకోవచ్చని సింగరేణి సూచించింది. ఈ మేరకు సింగరేణి అగ్రిమెంట్లో 5 మిలియన్ టన్నుల సరఫరా తగ్గించుకుని.. అదే మొత్తం బొగ్గు సరఫరాకు కోల్ ఇండియాతో జెన్కో అగ్రిమెంట్ చేసుకుంది.
రోజుకు 14 వేల టన్నుల చొప్పున సరఫరా
ఒడిషా రాష్ట్రంలోని మహానది బొగ్గు గని నుంచి రాష్ట్రానికి రోజుకు సుమారు 14 వేల టన్నుల బొగ్గు సరఫరా చేయడానికి అంగీకరించింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ(సీఈఏ)కి గతంలో రాసిన లేఖలు, కేంద్ర విద్యుత్ శాఖ సెక్రటరీ అధ్యక్షతన జూలై 30న జరిగిన ఇంటర్-మినిస్టీరియల్ కమిటీ (ఐఎంసీ) మీటింగ్ వివరాలతో జెన్ కో సీఈఓ హరీశ్ కేంద్రానికి లేఖ రాశారు. జెన్కో థర్మల్ పవర్ ప్లాంట్లలో తగినంత క్వాలిటీ బొగ్గు లేనందున కేంద్ర ప్రభుత్వ విధానాల ప్రకారం నోటిఫైడ్ ధరకే మహానది కోల్ లిమిటెడ్ నుంచి అదనపు బొగ్గు సరఫరా చేయాలని అందులో కోరారు. ఆయన విజ్ఞప్తి మేరకు కోల్ ఇండియా ప్రతినిధులు ఇటీవల రాష్ట్రంలో పర్యటించారు. క్వాలిటీ బొగ్గు ఉత్పత్తి, సరఫరా, సింగరేణి ఒప్పందాలపై చర్చించారు. జెన్ కో ప్లాంట్లకు ఏటా 5 మిలియన్ టన్నుల క్వాలిటీ బొగ్గు సరఫరాకు అంగీకరించారు.
ఐదు యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి
కోల్ ఇండియా ఒప్పందంతో యాదాద్రి ఫ్లాంట్ బొగ్గు కష్టాలు తీరనున్నాయి. 4 వేల మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్లాంట్‌కు సింగరేణి నైనీ గని ద్వారా ప్రతీ రోజు సుమారు 16 వేల నుంచి 20 వేల టన్నులు, రాష్ట్రంలో గనుల నుంచి సుమారు 8 వేల టన్నులు, మహానది బొగ్గు గని నుంచి రోజుకు 14 వేల టన్నుల క్వాలిటీ బొగ్గు సరఫరా చేయనున్నారు. రెగ్యులర్‌గా క్వాలిటీ బొగ్గు సరఫరా జరిగితే మొత్తం 5 యూనిట్ల ద్వారా నిర్విరామంగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఈ మేరకు కోల్ ఇండియాతో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయి. - హరీశ్, జెన్కో సీఎండీ
