- అణగారిన వర్గాలను అసెంబ్లీకి తీసుకెళ్తమని హామీ
హైదరాబాద్, వెలుగు: అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో చూపిన కాన్షీరామ్‌కు ‘భారతరత్న’ ప్రకటించాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాన్షీరాం స్ఫూర్తితోనే సామాజిక న్యాయ తెలంగాణను సాధించి తీరుతామని అన్నారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని పార్టీ ఆఫీసులో కాన్షీరాం వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, జిల్లా అధ్యక్షులు, అనుబంధ విభాగాల నేతలతో కవిత సమీక్షించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో బహుజనులను, అణగారిన వర్గాలను కచ్చితంగా అసెంబ్లీకి తీసుకెళ్తామని చెప్పారు. పార్టీ ప్రధాన సిద్ధాంతమైన ‘పాంచజన్యం’ను రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ చేరవేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
చిత్రపురి కాలనీపై సీబీఐ, ఈడీ విచారణ జరపాలి
చిత్రపురి కాలనీలో జరిగిన భూ అక్రమాలపై తక్షణమే సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డిని కవిత డిమాండ్ చేశారు. చిత్రపురి కాలనీ సాధన సమితి ప్రతినిధులతో భేటీ అనంతరం ఆమె మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ అండతో అనిల్ అనే వ్యక్తి సొసైటీని చెరబట్టి అక్రమాలకు పాల్పడ్డాడని, కోర్టు నిబంధనలను ఉల్లంఘించి బాధితుల పొట్టకొట్టాడని ఆరోపించారు. సొసైటీ రూల్స్‌కు విరుద్ధంగా మిగిలిన 4 ఎకరాల భూమిని ఏటా 24 శాతం వడ్డీతో రూ.19 కోట్లకు మార్ట్‌గేజ్ పెట్టి ఫ్లాట్లు కడుతున్నారని, దీనిపై ప్రభుత్వం స్పందించాలని కోరారు.
