- సీఎం ప్రజావాణిలో మంత్రి లక్ష్మణ్‌కుమార్‌కు బాధితుల విజ్ఞప్తి
పంజాగుట్ట, వెలుగు : ‘సార్ నా భర్త...ఉన్న ఊరిలో పని లేక ఉక్రెయిన్ పోయిండు..సెప్టెంబర్ 1 తారీఖు రష్యా దేశం బాంబులేస్తె ఉన్న రూములనే కన్నుమూసిండట..ఇది జరిగి ఇప్పటికి 39 రోజులు..ఇంకా పీనుగు రాలే..అడిగితే రూ.6 లక్షలు కట్టమంటున్నరు..మేం పేదోళ్లం..అన్ని పైసలు మా దగ్గర లేవు..కనీసం చివరి చూపైనా దక్కించుండి సార్’ అని ఓ బాధితురాలు సీఎం ప్రజావాణిలో మంత్రి లక్ష్మణ్‌కుమార్‌కు మొరపెట్టుకున్నది. జగిత్యాల అర్బన్‌జిల్లా హస్నాబాద్‌కు చెందిన వావిలాల సుదర్శన్ గౌడ్ (42) సెంట్రింగ్పని చేసేవాడు.
ఇక్కడ పనులు దొరక్క నాలుగు నెలల కింద కన్స్ట్రక్షన్వర్కర్గా ఉక్రెయిన్ వెళ్లాడు. రెండు నెలల కింద సెప్టెంబర్1వ తేదీన రూమ్‌లో ఉండగా..రష్యా మిసైల్దాడులు చేసింది. ఈ ఘటనలో సుదర్శన్అక్కడికక్కడే చనిపోయాడు. అప్పటి నుంచి అతడి డెడ్‌బాడీని తీసుకురావడానికి భార్య భార్గవి, ఇద్దరు బిడ్డలు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి భార్గవితో పాటు మృతుడి తల్లి గంగు, సర్పంచ్ బత్తుల గంగాధర్ వచ్చారు.
ఈ సందర్భంగా అక్కడికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాగా ఆయనకు విన్నవించుకున్నారు. సీఎంఓతో మాట్లాడి ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ కె. విద్యాసాగర్, ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్మంద భీంరెడ్డి, సభ్యులు చెన్నమనేని శ్రీనివాస రావు, స్వదేశ్ పరికిపండ్ల పాల్గొన్నారు.
