ఎండలు మండవట్టె.. బస్షెల్టర్లు లేవాయే..హైదరాబాద్ లో 2,350 బస్టాపులు.. షెల్టర్లు ఉన్నది సగమే..!

ఎండలు మండవట్టె.. బస్షెల్టర్లు లేవాయే..హైదరాబాద్ లో 2,350 బస్టాపులు.. షెల్టర్లు ఉన్నది సగమే..!
  • 1200 ఏర్పాటు చేయాలన్న ఆర్టీసీ  లెటర్​
  • పనులు స్పీడప్​ చేయని జీహెచ్ఎంసీ  
  • తిప్పలు పడుతున్న సిటీ ప్యాసింజర్లు 

హైదరాబాద్ సిటీ, వెలుగు:  సిటీలో బస్‌‌ షెల్టర్ల ఏర్పాటు, నిర్వహణలో జీహెచ్‌‌ఎంసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. బస్టాపుల్లో షెల్టర్లు ఏర్పాటు చేయకపోవడంతో ఎండకు ఎండుతూ, వాన వస్తే తడుస్తూ రోడ్లపైనే బస్సుల కోసం వేచి చూడాల్సి వస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గ్లోబల్​సిటీగా పిలిచే రాజధానిలోని గ్రేటర్ ఆర్టీసీ పరిధిలో ఉన్న 2,350  బస్టాపుల ద్వారా రోజూ సుమారు12 లక్షల మంది బస్సుల్లో ప్రయాణిస్తుండగా, కేవలం 1,150  ప్రాంతాల్లో మాత్రమే బస్‌‌ షెల్టర్లు ఏర్పాటు చేశారు. అంటే దాదాపు సగం బస్టాపుల్లో షెల్టర్లే లేవు. 

మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ బస్సు ఫెసిలిటీ ఇవ్వడంతో మహిళలు చాలా వరకు బస్సుల్లోనే జర్నీ చేస్తున్నారు. వీరితో పాటు వృద్ధులు, చిన్నారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఎల్ నినో ప్రభావంతో ఎండ దంచికొడుతూ వేసవిని తలపిస్తుండగా, షెల్టర్లు లేక చెట్ల కింద, పక్కన ఉన్న షాపుల కింద తలదాచుకుంటున్నారు. 

ఆర్టీసీ లెటర్​రాసినా నో రెస్పాన్స్​ 

సిటీలో బస్‌‌ షెల్టర్ల కొరత ఉందని,  1200 షెల్టర్లు ఏర్పాటు చేయాలని నెల రోజుల క్రితం ఆర్టీసీ..జీహెచ్‌‌ఎంసీకి లెటర్​రాసింది. మొదటి విడతలో 575 షెల్టర్లు ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయం కూడా చేశారు. అయినా, అడుగు మాత్రం ముందుకు 
వేయడం లేదు. 

బస్సులు ఆగని చోట షెల్టర్లు..

నగరంలో చాలా చోట్ల బస్సులు ఆగకపోయినా...ప్రకటనలు వేసుకోవడానికి బస్​షెల్టర్లను నిర్మించారు. దిల్‌‌సుఖ్‌‌నగర్‌‌, ఖైరతాబాద్‌‌, హిమాయత్‌‌నగర్‌‌, కోఠి, మెహిదీపట్నం, కూకట్‌‌పల్లి, బంజారాహిల్స్‌‌ వంటి వాణిజ్య ప్రాంతాల్లో ఇలాంటి బస్‌‌ షెల్టర్లు కనిపిస్తాయి. బస్‌‌ షెల్టర్లను బిల్డ్‌‌ ఆపరేట్‌‌ ట్రాన్స్‌‌ఫర్‌‌ పద్ధతిలో ఏర్పాటు చేయడం, సదరు సంస్థలకు ఆదాయం రావడానికి ప్రకటనల ద్వారా సంపాదించుకోవచ్చని అవకాశం ఇవ్వడం దీనికి కారణమైంది. 

2017లో 826 షెల్టర్లను 15 ఏండ్ల కాలపరిమితితో యూని యాడ్స్‌‌ లిమిటెడ్‌‌, ప్రకాష్‌‌ ఆర్ట్స్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌, కేకేఆర్‌‌సీ ఇన్‌‌ఫ్రా ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ సంస్థలకు జీహెచ్​ఎంసీ కేటాయించింది. 2016లో లీడ్‌‌ స్పేస్‌‌ కు 143 షెల్టర్లను పదేండ్ల కాలపరిమితితో అప్పగించి..పనితీరు, డిజైన్‌‌ మార్పులకు సంబంధించి గడువు పొడిగింపు కూడా ఇచ్చింది. 2020 లో మరో 201 షెల్టర్లను ప్రకాష్‌‌ ఆర్ట్స్‌‌, యూని యాడ్స్‌‌కు కేటాయించింది. ఇవి ఏండ్ల క్రితం ఏర్పాటు చేసినవి కావడం, అందులో కుర్చీలు లేకపోవడం, నిర్వహణ పట్టించుకోకపోవడంతో ఉపయోగపడడం లేదు. 

ఫెసిలిటీస్​ కావాలి 

షెల్టర్లను కేవలం నిర్మించడంపైనే దృష్టి పెట్టకుండా అందులో సౌకర్యాలపై అధికారులు దృష్టి పెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. కూర్చునేందుకు కుర్చీలు, పరిశుభ్రత, నిర్వహణను పట్టించుకోవాలంటున్నారు. అలాగే, ఇప్పుడున్న చోట్లనే కాకుండా సర్వే నిర్వహించి షెల్టర్లు లేని ప్రాంతాల్లో రద్దీకి అనుగుణంగా కొత్తవి ఏర్పాటు చేయాలని డిమాండ్‌‌ చేస్తున్నారు.