జ్యోతిష్య పరంగా.. ఆధ్యాత్మికంగా రేపు ( 2026 అక్టోబర్ 10) చాలా శక్తివంతమైన రోజు.. మహాలయ అమావాస్య.. శని అమావాస్య రెండూ ఒకే రోజు వచ్చాయి.పురాణాల ప్రకారం సర్వపితృ అమావాస్య.. ఈ రోజున పితృ దేవతలను పూజించాలి. హిందూ సంప్రదాయం శనివారం శని భగవానుడిని పూజిస్తారు..అలాగే శివుడిని ఆరాధించడం.. దాన ధర్మాలు చేస్తే జీవితంలో కష్టాలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు. ఇలాంటి పవిత్రమైన 2026 అక్టోబర్ 10 న ఏం చేయాలి .. ఏం చేయకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
పండితులు తెలిసిన వివరాల ప్రకారం (2026 అక్టోబర్ 10) శనివారం నాడు మహాలయ అమావాస్య (సర్వపితృ అమావాస్య), శని అమావాస్య ఒకే రోజున రావడం హిందూ సంప్రదాయంలో విశేషంగా భావిస్తారు. ఈ రోజును పితృదేవతలను స్మరించుకోవడానికి, శనిదేవుడిని ఆరాధించడానికి, దానధర్మాలు చేయడం వలన పితృదేవతల ఆత్మకు శాంతి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
మహాలయ అమావాస్య రోజు కొన్ని ఆచారాలను పాటిస్తే కష్టాలు తొలగి.. పితృ దేవతల ఆశీస్సులు కలుగుతాయి. పితృ దేవతలను భక్తితో.. స్మరిస్తూ సేవా భావం కలిగి ఉండాలి. భక్తి, పితృస్మరణ, సేవాభావంతో ఆచరించడం ముఖ్యం.
చేయాల్సిన ముఖ్యమైన 6 పనులు
1. పితృదేవతలకు తర్పణం: ఉదయం స్నానం చేసి, మీ పూర్వీకులను స్మరించుకోండి. సంప్రదాయం ప్రకారం నీరు, నల్ల నువ్వులతో తర్పణాలు వదలాలి. అన్న శ్రార్దం పెడితే చాలా మంచిది. అలా కుదరని వారు తర్పణాలు వదిలి .. సూర్య భగవానుడికి.. పితృదేవతలకు నమస్కరించి.. బ్రాహ్మణులకు స్వయంపాకం ఇవ్వాలి.
2. అన్నదానం : ఆర్థిక స్థోమత ప్రకారం పేదలకు అన్నదానం చేయండి.అవసరంలో ఉన్న వారికి బియ్యం, పప్పులు, ఉప్పు,ఇతర వంట సామాగ్రి దానం చేయండి.
3. నల్ల నువ్వులు, వస్త్రాలు : శనివారం అమావాస్య.. పితృ అమావాస్య రెండూ ఒకే రోజు వచ్చాయి. శని భగవానుడిని పూజించి..నల్లనువ్వులు, ఆహార పదార్దాలు.. నిత్యావసర వస్తువులు, వస్త్రాలు అవసరం ఉన్న వారికి దానం చేయాలి. అంతే కాని బంధువులకు ఇస్తే ఫలితం ఉండదు. అయితే బంధువుల్లో నిజంగా అలాంటి అవసరం ఉన్నవారికి ఇవ్వవచ్చని పురాణాల ద్వారా తెలుస్తుంది. దానం విషయంలో పిసినారితనం చూపించకూడదు.
4. శనిదేవుడిని పూజించడం: అమావాస్య,, శనివారం రెండూ ఒకే రోజు చాలా విశేషమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. శివాలయంలో శని భగవానుడి దగ్గర నువ్వులనూనెతో దీపారాధన చేయండి. బెల్లం.. నువ్వులను నైవేద్యం సమర్పించండి. కాకులకు ఆహారం ఇవ్వాలి. గోమాతకు గోధుమలు ఆహారంగా ఇవ్వండి. ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని భక్తితో జపం చేయాలి.
5. రావిచెట్టుకు పూజ: రావి చెట్టు మొదట్లో ఆవనూనెతో దీపారాధన చేయాలి. దీపారాధనను చెట్టుకు హాని కలిగించకుండా ఉండేలా చూసుకోవాలి. రావి చెట్టుకు నమస్కరించి ప్రదక్షిణాలు చేయాలి.
6. ఇంట్లో దీపారాధన : ప్రదోష కాలంలో (సాయంత్రం సమయంలో) ఇష్టదైవాన్ని.. కుల దైవాన్ని స్మరిస్తూ దీపారాధన చేయాలి. కుటుంబ సభ్యలు క్షేమంగా ఉండేందుకు.. పితృ దేవతల ఆత్మకు శాంతి కలిగేలా ప్రార్థించాలి. పక్షులకు, జంతువులకు ఆహారం..నీరు అందించండి.
అక్టోబర్ 10న ఏ సమయంలో ఏమి చేయాలి
- ఉదయం : స్నానం, పితృస్మరణ, తర్పణం
- మధ్యాహ్నం : శ్రాద్ధం, అన్నదానం, వస్త్రదానం, స్వయంపాక దానం, గోమాతకు ఆహారం, కాకికి అన్నం పెట్టడం
- సాయంత్రం: శనిదేవుని పూజ, దీపారాధన, మంత్రజపం
శని అమావాస్య.. పితృ అమావాస్య రోజు ఏం చేయకూడదు
- గొడవలు, కఠినమైన మాటలు, ఇతరులను బాధించే పనులకు దూరంగా ఉండండి.
- మద్యం, మాంసాహారం తినకూడదు
- ధూమపానం కూడా చేయకూడదు
- విశేషమైన పూజలకు దూరంగా ఉండాలి
- ఎట్టి పరిస్థితిలో అప్పులు చేయవద్దు.
- పితృ దేవతలను స్మరించుకోండి
- ఒక్కపూట మాత్రమే భోజనం చేయాలి.
మహాలయ అమావాస్య పితృస్మరణకు, శని అమావాస్య శనిదేవుని ఆరాధనకు ప్రాధాన్యమైనవి. రెండింటినీ కలిపి ఆచరించాలంటే పితృకార్యాలకు తగిన సమయం కేటాయించి, తరువాత శనిదేవుని పూజ చేయాలని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
