వాంటా (ఫిన్లాండ్): రెండుసార్లు ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు.. ఆర్కిటిక్ ఓపెన్‌లో క్వార్టర్‌ఫైనల్‌తోనే సరిపెట్టుకుంది. శుక్రవారం జరిగిన విమెన్స్ సింగిల్స్‌లో ఆరోసీడ్ సింధు 11–21, 21–19, 18–21తో టాప్‌సీడ్ రచ్చనోక్ ఇంతనోన్ (థాయ్‌లాండ్) చేతిలో పోరాడి ఓడింది. గంటా 2 నిమిషాల మ్యాచ్‌లో తెలుగమ్మాయి తొలి గేమ్‌లో అద్భుతంగా ఆడింది. ఒకటి, రెండు పాయింట్లతో ముందుకెళ్లినా.. ఎక్కడా ప్రత్యర్థికి పుంజుకునే చాన్స్ ఇవ్వలేదు. 10–8 వద్ద వరుసగా 5 పాయింట్లు సాధించి వెనుదిరిగి చూసుకోలేదు. కానీ రెండో గేమ్‌లో పుంజుకున్న ఇంతనోన్ క్రాస్ కోర్టు ర్యాలీలలో పైచేయి సాధించింది.
దాంతో 14–16తో వెనకబడిన సింధు వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 19–17 ఆధిక్యంలో నిలిచినా గేమ్‌ను కాపాడుకోలేకపోయింది. బలమైన స్మాష్‌లతో చెలరేగిన ఇంతనోన్ వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి గేమ్ కైవసం చేసుకుంది. డిసైడర్‌లో ఇద్దరు షట్లరు హోరాహోరీగా తలపడ్డారు. ఫలితంగా ఒక్కో పాయింట్ ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. చివరకు 17–17తో స్కోరు వద్ద ఇంతనోన్ వరుసగా మూడు పాయింట్లు గెలవగా, సింధు ఒక్క పాయింట్‌తో సరిపెట్టుకుంది. ఆ వెంటనే మరో పాయింట్‌తో థాయ్ అమ్మాయి మ్యాచ్‌ను ముగించింది.
