సివిల్ సప్లై డీఎం బినామీకి రైస్ మిల్లు.. ఏసీబీ సోదాల్లో భారీగా ఆస్తులు బట్టబయలు

సివిల్ సప్లై డీఎం బినామీకి రైస్ మిల్లు.. ఏసీబీ సోదాల్లో భారీగా ఆస్తులు బట్టబయలు
  • డాక్యుమెంట్లు, నగదు, బంగారం స్వాధీనం

ఖమ్మం టౌన్, వెలుగు: మహబూబాబాద్ జిల్లా పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ (డీఎం) గా విధులు నిర్వహిస్తున్న వాసంశెట్టి నరసింహారావు పరిమితికి మించిన అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా అక్రమాస్తులు బయటపడడంతోపాటు ఆయన బినామీ పేర ఏకంగా రైస్​ మిల్లు ఉన్నట్టు తేలింది.

శుక్రవారం ఖమ్మం సిటీలోని కవిరాజ్ నగర్ లో ఉన్న నరసింహారావు ఇంట్లో నేలకొండపల్లి, సూర్యాపేట జిల్లా గరిడేపల్లి, మహబూబాబాద్, హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో ఖమ్మం ఉమ్మడి జిల్లాల ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్​ ఆధ్వర్యంలో ఉదయం నుంచి రాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి.

డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో ఏడు చోట్ల సోదాలు నిర్వహించారు. నరసింహారావు గతంలో ఖమ్మం, నిర్మల్ లో సివిల్ సప్లై అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్​)గా పనిచేశారు. ఆ తర్వాత సస్పెండ్​ అయ్యి మహబూబాబాద్ జిల్లాలో తాత్కాలిక జిల్లా మేనేజర్ గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం రెగ్యులర్ జిల్లా మేనేజర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అతడు తన 15 ఏండ్ల సర్వీస్ లో తన జీతం కంటే రెట్టింపులో అక్రమ ఆస్తులు కూడా బెట్టినట్లు అధికారులు గుర్తించారు.    దీంతో నరసింహారావు ను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి, చంచల్ గూడ జైల్ కు తరలిస్తామని డీఎస్పీ తెలిపారు.

తనిఖీల్లో గుర్తించిన అక్రమాస్తులు ఇవే..! 
ఖమ్మం జిల్లా రఘునాధపాలెం, బల్లేపల్లి, వెలుగుమట్లలో నరసింహారావు, ఆయన భార్య పేరు మీద ఐదు ప్లాట్లు ఉండగా, అవి మొత్తం కలిపి1,230 గజాలు ఉన్నట్టు గుర్తించారు. సూర్యాపేట జిల్లా కల్మలచెరువులో ఎకరం ఎనిమిది గుంటలు, సిరికొండలో 21.3 ఎకరాలు, నామవరంలో 5.3 ఎకరాలు భూమి నరసింహారావుతో పాటు ఆయన మామ పేర్ల మీద ఉన్నట్టు గుర్తించారు.

వీటి విలువ దాదాపు రూ. 2కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఖమ్మం కవిరాజ్ నగర్ లో ఐదంతస్తుల్లో ఒక భవనం, మూడంతస్తుల్లో మరో భవనం, హైదరాబాద్ ఎల్బీనగర్లో రెండంతస్తుల భవనం ఉన్నట్టు గుర్తించారు. 36 తులాల బంగారం, 33 తులాల వెండి గుర్తించారు. వీటన్నిటి విలువ రూ. 9.41 కోట్లు ఉంటుందని లెక్క కట్టారు.