సిద్దిపేట రూరల్, వెలుగు : ఒకప్పుడు బెంగాల్ ఆలోచిస్తే దేశం ఆచరించేదని, నేడు తెలంగాణ ఏం చేస్తే దేశం అదే అనుసరించే స్థాయికి ఎదిగిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన యువజన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో జీఎస్‌డీపీ వృద్ధిలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలిచిందని, పంజాబ్‌ను అధిగమించి వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానానికి ఎదిగిందని పేర్కొన్నారు.
1983లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన సమయంలో సిద్దిపేటను జిల్లాగా ఏర్పాటు చేయాలని కేసీఆర్ స్వయంగా ఆయనకు దరఖాస్తు అందజేశారని హరీశ్‌రావు తెలిపారు. కేసీఆర్ సీఎం అయ్యాక, ఏ చేత్తో ఎన్టీఆర్‌కు దరఖాస్తు ఇచ్చారో అదే చేత్తో సంతకం చేసి 2016 అక్టోబర్ 11న సిద్దిపేట జిల్లాను ఏర్పాటు చేశారని చెప్పారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన 10కే రన్‌ను హరీశ్‌రావు జెండా ఊపి ప్రారంభించి, పరుగులో పాల్గొన్నారు.
రంగధాంపల్లి అమరవీరుల స్తూపం వద్ద మాజీ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డితో కలిసి అమరవీరులకు నివాళులర్పించారు. సాయంత్రం ఎన్‌జీవోస్ భవన్‌లో జిల్లా దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు.
