- ఢిల్లీని ముట్టడిస్తామని స్పష్టీకరణ
హైదరాబాద్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరి వీడకపోతే రాబోయే రోజుల్లో ఆ పార్టీకి కేంద్రంలో ఇదే చివరి పాలన అవుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేసి బీసీ రిజర్వేషన్ల పరిమితి పెంచాలని, లేదంటే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేసి ఢిల్లీని ముట్టడిస్తామని స్పష్టం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ, ఏపీ కమిటీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో ‘అమ్మ పెట్టదు.. అడుక్కునివ్వదు’ అన్నట్లుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్రాలకు ఇవ్వాలని, ఇందుకోసం పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 14, 15 తేదీల్లో ఢిల్లీలో చేపట్టనున్న ఆందోళనకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని పార్లమెంట్‌లో ఆమోదించాలని కేంద్రాన్ని కోరారు. బీసీ రిజర్వేషన్ల పెంపునకు రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెడితే ఇండియా కూటమి మద్దతు ఇస్తుందని తెలిపారు. ఢిల్లీ ఆందోళనకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. కేసన శంకర్‌రావు మాట్లాడుతూ ఏపీలోని ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు అఖిలపక్షంగా ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీతో చర్చించాలని కోరారు.
