న్యూఢిల్లీ, వెలుగు: రాజ్యాంగ సంస్థలపై దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈసీపై రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు రాజకీయ కుట్రలో భాగమేనని విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన రిలీజ్ చేశారు. రాజ్యాంగ సంస్థలు తమకు అనుకూలంగా లేనప్పుడు వాటి విశ్వసనీయతను దెబ్బతీయడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు. ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు, కాగ్ వంటి స్వతంత్ర వ్యవస్థలపై నిందలు వేయడం కాంగ్రెస్ దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు.
దేశంలో వరుసగా ఎన్నికల్లో ఓటమిపాలవడాన్ని జీర్ణించుకోలేక, రాచరికపు ఫ్యూడల్ మనస్తత్వంతో రాహుల్ గాంధీ దేశ ప్రతిష్టను దిగజార్చుతున్నారని మండిపడ్డారు. తన కుటుంబానికి దేశాన్ని పాలించే జన్మహక్కు ఉందనే భావన నుంచి ఆయన బయటకు రాలేకపోతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ సంస్థలపై నిందలు మాని, ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకోవడంపై దృష్టి పెట్టాలని కిషన్ రెడ్డి సూచించారు.
