- అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ప్రపంచ పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2.0 కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులంతా సమన్వయంతో పని చేయాలని సూచించారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ కోసం ప్రజా భవన్ లో ఏర్పాటు చేసిన వార్ రూమ్‌ను శుక్రవారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ వివిధ శాఖల అధికారులకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. శాఖల మధ్య నిరంతరం సమన్వయం ఉండేలా స్పష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షించడం, అంతర్జాతీయంగా రాష్ట్ర ప్రతిష్టతను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయన వెంట ఆర్థిక, ప్లానింగ్ ముఖ్యకార్యదర్శి గౌరవ్ ఉప్పల్ తోపాటు వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
