రంజీ ట్రోఫీ బరిలో జడేజా

రంజీ ట్రోఫీ బరిలో జడేజా

రాజ్‌‌‌‌కోట్‌‌: టీమిండియా స్టార్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ రవీంద్ర జడేజా.. రంజీ ట్రోఫీ సీజన్‌‌లో సౌరాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఛత్తీస్‌‌గఢ్‌‌తో జరిగే తొలి మ్యాచ్‌‌ కోసం ప్రకటించిన 16 మంది సభ్యుల జట్టులో జడ్డూకు స్థానం దక్కింది. వెస్టిండీస్‌‌తో వన్డే సిరీస్‌‌ ముగియడంతో ప్రస్తుతం జడేజా రంజీలపై దృష్టిపెట్టాడు. వచ్చే నెలలో న్యూజిలాండ్‌‌ పర్యటన నేపథ్యంలో రెడ్‌‌ బాల్‌‌ ప్రాక్టీస్‌‌ కోసం జడేజా ఈ మ్యాచ్‌‌ ఆడనున్నాడు. 

ఈ నెల 11 నుంచి రంజీ మ్యాచ్‌‌లు ప్రారంభం కానున్నాయి. ఎలైట్ గ్రూప్–-బిలో సౌరాష్ట్ర.. ఆంధ్ర, అసోం, ఛత్తీస్‌‌గఢ్, హైదరాబాద్, కర్ణాటక, పంజాబ్, త్రిపుర జట్లతో తలపడనుంది. గత సీజన్‌‌లో లీగ్ దశలోనే వెనుదిరిగిన సౌరాష్ట్ర ఈసారి మెరుగైన ప్రదర్శన లక్ష్యంగా పెట్టుకుంది. జైదేవ్ ఉనద్కత్ కెప్టెన్‌‌గా వ్యవహరించనున్నాడు. ఇటీవలి కౌంటీ క్రికెట్‌‌లో సస్సెక్స్ తరఫున ఆడిన ఉనద్కత్ 7 మ్యాచ్‌‌లలో 28 వికెట్లు పడగొట్టి అద్భుత ఫామ్‌‌లో కనిపిస్తున్నాడు. చేతన్ సకారియాతో కలిసి ఉనద్కత్ పేస్ విభాగాన్ని నడిపించనున్నాడు. గతంలో రెండుసార్లు రంజీ ట్రోఫీ సాధించిన సౌరాష్ట్ర జట్టు, గత సీజన్‌‌లోని 14 మంది ఆటగాళ్లను యధావిధిగా కొనసాగించింది.