- పెద్ద పేగుకు ఇన్ఫెక్షన్తో ఏడేండ్ల బిడ్డ నరకయాతన
- దూకి కాపాడిన ఆటో డ్రైవర్
ట్యాంక్ బండ్, వెలుగు : ఆ తల్లి తన బిడ్డను తొమ్మిది నెలలు మోసింది. పాప కదులుతుంటే కడుపులో సీతాకోకచిలుకలు ఎగిరిన అనుభూతి చెంది ఆనందపడింది. నెలలు నిండేకొద్దీ అప్పుడప్పుడు ఆ చిట్టి పాదాలు తంతుంటే అసౌకర్యంగా అనిపించినా తన చిన్నారి పూర్తి ఆరోగ్యంగా ఉందని భరించింది. చివరకు పురిటి నొప్పులను పంటి బిగువున అదిమిపట్టి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తన గారాల పట్టి ముద్దు ముద్దు మాటలకు మురిసిపోయింది.
ఆ చిన్నారి చేతులను పట్టుకుని నడకలు నేర్పింది. ఇలా..తన పాపాయితో సాఫీగా సాగిపోతున్న జీవితంలో ఆమెను ఒక్కసారిగా కష్టాలు, కన్నీళ్లు చుట్టుముట్టాయి. తన బంగారు కొండను మాయదారి రోగం పీడిస్తోందని తెలుసుకుని కుమిలిపోయింది. అయినా తట్టుకుని నిలబడింది. మొండి ధైర్యంతో ఎలాగైనా బాగు చేయించాలని అనుకుంది.
కానీ, రాను రాను ఎవరి మద్దతు లేకపోవడం, ఒంటరిగా పాపను బతికించుకునే అవకాశం లేక ఆశలు సన్నగిల్లి వేళ్లు పట్టుకుని నడిపించిన చేతులతోనే ‘సాదలేను బిడ్డా..సచ్చిపో’ అంటూ హుస్సేన్‌సాగర్‌లోకి విసిరేసింది. ఈ విషాద గాథ నగరం నడిబొడ్డున ఉన్న ట్యాంక్‌బండ్‌పై శుక్రవారం జరిగింది.
ఎవరా తల్లి..ఏంటా వ్యథ..
ఓల్డ్ బోయినపల్లి హస్మత్ పేటకు చెందిన షబానాకు ఇద్దరు బిడ్డలు..భర్త ఐదేండ్ల కింద వదిలేసి ఆంధ్రాకు వెళ్లిపోయాడు. ఇద్దరు ఆడపిల్లలున్నా ధైర్యం చెడక నాలుగిండ్లలో పని చేస్తూ వారిని పోషించుకుంటూ వస్తోంది. ఇందులో రెండో బిడ్డ రుక్సానా (7) మలద్వారం మూసుకుపోవడం, పెద్ద పేగు ఇన్ఫెక్షన్ రావడంతో ట్రీట్మెంట్చేయించడానికి నిద్ర కూడా పోకుండా మరిన్ని ఇండ్లల్లో పని చేస్తోంది. తిన్న ఆహారం బయటకు వెళ్లిపోవడానికి ఆపరేషన్ చేయించింది.
బొడ్డు పక్కన చిన్న రంధ్రం చేయడంతో సమస్య తాత్కాలికంగా పరిష్కారమైంది. అయితే, ఆ తల్లి కష్టాలు మరింత పెరిగాయి. బిడ్డ పక్కనే ఉంటూ గుడ్డతో బొడ్డు పక్కనుంచి వచ్చిన మలాన్ని అంతా ఎప్పటికప్పుడు తుడవాల్సి వచ్చింది. డాక్టర్లు మళ్లీ ఆపరేషన్ చెప్పడం, లక్షలు వెచ్చించాల్సిన అవసరం రావడంతో ఆ డబ్బుల కోసం ఎక్కడెక్కడికో వెళ్లింది. ఎవరూ సాయం చేయకపోవడం, బిడ్డ నరకయాతన అనుభవిస్తుండడంతో కఠిన నిర్ణయం తీసుకుంది.
ముద్దు పెట్టి..హత్తుకుని..
గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు రుక్సానా ను తీసుకొని సరాసరి హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకుంది. చివరిసారిగా హత్తుకుంది..ముద్దులు పెట్టింది. ‘బిడ్డా నిన్ను బతికుంచుకునే స్థోమత నాకు లేదు. నువ్వు పడే నరకయాతన చూడలేకపోతున్నా’ అంటూ ఒక్కసారిగా హుస్సేన్‌సాగర్‌లోకి విసిరేసింది.
నీళ్లలో పడి మునిగి తేలుతున్న పాపను చూసిన ఓ ఆటోడ్రైవర్ఒక్క ఉదుటున హుస్సేన్‌సాగర్‌లోకి దూకి చిన్నారిని బయటకు తీసుకువచ్చాడు. వెంటనే పాపను గాంధీ దవాఖానకు తరలించారు. భయంతో పారిపోయిన ఆ తల్లిని పోలీసులు వెతికి తీసుకువచ్చారు. ఇప్పుడు మళ్లీ గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్న తన బిడ్డ పక్కనే కూర్చుని సపర్యలు చేస్తోంది.
