దసరా రోజున హుజూర్ నగర్లో మోడల్ కాలనీ ఇండ్ల  కేటాయింపు

దసరా రోజున హుజూర్ నగర్లో మోడల్ కాలనీ ఇండ్ల  కేటాయింపు
  • ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి
  • అసంపూర్తి పనులను స్పీడ్గా పూర్తి చేయాలి: మంత్రి ఉత్తమ్

హుజూర్ నగర్, వెలుగు: సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ నియోజకవర్గంలోని రామస్వామి గుట్ట వద్ద నిర్మించిన హౌసింగ్ కాలనీలోని ఇండ్లను దసరా నాటికి అర్హులకు పంపిణీ చేయాలని, ఆ లోపు కాలనీలో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డి ఆఫీసర్లను ఆదేశించారు.

హౌసింగ్ కార్యదర్శి వీపీ.గౌతమ్, సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, వివిధ శాఖల ఉన్నతాధికారులతో శుక్రవారం కలెక్టరేట్ లో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మోడల్ కాలనీలో అసంపూర్తిగా మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.

లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసుకునే నాటికి తాగునీరు, కరెంట్, ఇంటర్నల్​రోడ్లు, డ్రైనేజీ తదితర సదుపాయాలు కల్పించాలని సూచించారు. కాలనీలోని పిల్లల కోసం కామన్ స్టడీ రూమ్స్ తో పాటు రిక్రియేషన్​ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. కాలనీలో స్కూలు, అంగన్ వాడీ కేంద్రం, వైద్య సదుపాయాలు, ఆట స్థలాల వంటి సౌకర్యాలకు ప్లాన్​ చేయాలన్నారు.

ఈ కాలనీని రాష్ట్రంలోనే మోడల్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. అక్టోబర్ 20 దసరా రోజున లబ్ధిదారులకు ఇండ్ల కేటాయింపు పత్రాలు పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు. కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు.