కూరగాయల సాగు వైపు మళ్లాలి.. వరికి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి

కూరగాయల సాగు వైపు మళ్లాలి.. వరికి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి
  • సీజన్‌‌‌‌‌‌‌‌కు తగ్గట్లు కూరగాయలు సాగు చేస్తే ఆదాయం పెరిగే చాన్స్‌‌‌‌‌‌‌‌
  • రైతులకు ఉద్యాన శాఖ సూచన

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలోని రైతులు వరికి ప్రత్యామ్నాయంగా కూరగాయల సాగుపై దృష్టి పెట్టాలని ఉద్యాన శాఖ సూచిస్తోంది. కూరగాయల సాగు వల్ల తక్కువ నీటి వినియోగంతో పాటు మెరుగైన ఆదాయం పొందే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఒకే పంటపై ఆధారపడటం కంటే సీజన్‌‌‌‌‌‌‌‌కు అనుగుణంగా రకరకాల కూరగాయలు సాగు చేస్తే రైతుకు మేలు జరుగుతుందని పేర్కొంటున్నారు.

వరికి నీరు ఎక్కువ అవసరం కాగా, కూరగాయ పంటలకు డ్రిప్‌‌‌‌‌‌‌‌ ఇరిగేషన్ ద్వారా పండించవచ్చని చెబుతున్నారు. వరి పంట కాలం పూర్తయ్యే వరకు రైతు ఆదాయం కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. అదే టమాటా, పచ్చిమిర్చి, బీరకాయ, కాకరకాయ, దోసకాయ, ఆకుకూరలు వంటి పంటల్లో కోతలు ప్రారంభమైన తర్వాత విడతల వారీగా ఆదాయం ఉంటుంది.

కూరగాయల సాగులో ధరల హెచ్చుతగ్గులు, త్వరగా పాడయ్యే స్వభావం వంటి రిస్కులు కూడా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. రైతు సామాజికవర్గ ఆధారంగా డ్రిప్‌‌‌‌‌‌‌‌కు 80 నుంచి 100 శాతం వరకు, స్ప్రింక్లర్‌‌‌‌‌‌‌‌కు 75 శాతం వరకు రాయితీలు అందిస్తున్నాయి. మల్చింగ్‌‌‌‌‌‌‌‌ విధానం ద్వారా నేలలో తేమను కాపాడుకోవడం, కలుపు మొక్కల పెరుగుదలను నియంత్రించడం, పంట నాణ్యతను మెరుగుపరచడం వంటి ప్రయోజనాలు పొందవచ్చు. కూరగాయల సాగుకు ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌ మల్చింగ్‌‌‌‌‌‌‌‌పై కూడా రాయితీ అందిస్తున్నాయి.

సీజన్‌‌‌‌‌‌‌‌కు తగ్గ పంట.. మార్కెట్‌‌‌‌‌‌‌‌కు తగ్గ ప్రణాళిక..
రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వేర్వేరు సీజన్లలో పలు రాకల కూరగాయలను సాగు చేయాలని ఉద్యాన శాఖ సూచిస్తోంది. వానాకాలంలో టమాటా, పచ్చిమిర్చి, బీరకాయ, కాకరకాయ వంటి పంటలకు ప్రాధాన్యం ఇవ్వవచ్చు. క్యాబేజీ, కాలీఫ్లవర్‌‌‌‌‌‌‌‌, క్యారెట్‌‌‌‌‌‌‌‌, చిక్కుడు వంటి పంటలనూ ఎంచుకోవచ్చు. యాసంగిలో పుచ్చకాయ, దోసకాయ, ఆకుకూరల సాగుపై దృష్టి పెట్టవచ్చు. జిల్లాల నుంచి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ వంటి పెద్ద మార్కెట్లకు రవాణా సౌకర్యం ఉండటం కూరగాయల సాగుకు అనుకూల అంశంగా అధికారులు చెబుతున్నారు.

అయితే రైతులు విత్తనాలు వేసే ముందే సమీప మార్కెట్లలో డిమాండ్‌‌‌‌‌‌‌‌, గత ధరల పరిస్థితి, పంట కోత సమయం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే సరఫరా వంటి అంశాలను పరిశీలించాలని సూచిస్తున్నారు. కూరగాయల సాగులో ఎకరాకు నికర లాభం వరితో పోలిస్తే మూడు నుంచి నాలుగు రెట్లు అధికంగా ఉండే అవకాశం ఉందని హార్టీకల్చర్ సైంటిస్టులు చెబుతున్నారు. ఇది ప్రతి పంటకు, ప్రతి సీజన్‌‌‌‌‌‌‌‌కు ఒకే విధంగా ఉండదు.

దిగుబడి, మార్కెట్‌‌‌‌‌‌‌‌ ధర, కూలీల ఖర్చు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, రవాణా ఖర్చులపై రైతు నికర ఆదాయం ఆధారపడి ఉంటుంది. ఖాళీ భూముల్లో టమాటా, బెండ, వంకాయ, కాకరకాయ, కాలీఫ్లవర్‌‌‌‌‌‌‌‌, ఆకుకూరలు వంటి అధిక విలువ గల కూరగాయలను సాగు చేయడంతో రెండున్నర ఎకరాలకు రూ.1.32 లక్షల నుంచి రూ.6.65 లక్షల వరకు వార్షిక ఆదాయం వస్తుందని ఐసీఏఆర్ నివేదికలు చెబుతున్నాయి. రాష్ట్రంలో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు శాశ్వత పందిళ్లు, హైబ్రిడ్‌‌‌‌‌‌‌‌ కూరగాయల నారు, మల్చింగ్‌‌‌‌‌‌‌‌ వంటి కార్యక్రమాలకు రాయితీ సహాయం అందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఎగుమతి స్థాయికి ఎదగాలి.. ఆయిల్​పామ్లో అంతర పంటగా కోకో సాగు చేయాలి : మంత్రి తుమ్మల
హైదరాబాద్, వెలుగు : కూరగాయల ఉత్పత్తిని పెంచి, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఎల్‌‌‌‌‌‌‌‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించడంతో పాటు హార్టికల్చర్​పంటల సాగును ప్రోత్సహించాలని ఆదేశించారు.

హార్టీకల్చర్, ఆయిల్ ఫెడ్ అధికారులతో శుక్రవారం సెక్రటేరియట్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యాన పంటల సాగు విస్తరణ, ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, కోకో కొనుగోలు కేంద్రాలు, ఆయిల్ ఫెడ్‌‌‌‌‌‌‌‌లో ఖాళీల భర్తీపై దిశానిర్దేశం చేశారు. కూరగాయల సాగును విస్తరించేందుకు నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని, ఉత్పత్తితో పాటు మార్కెటింగ్ సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు.

రాష్ట్రంలో పండించిన కూరగాయలకు ఇతర రాష్ట్రాల్లోనూ మార్కెట్ కల్పించేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు అనుకూలత ఉందని, కనీసం 10 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి ఉమ్మడి జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఉండేలా ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు.

ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటగా కోకో సాగు చేస్తూ కొందరు రైతులు మంచి ఆదాయం పొందుతున్నారని, ఈ సాగును విస్తరించేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఆయిల్ ఫెడ్‌‌‌‌‌‌‌‌లో ఖాళీల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసి అక్టోబర్ నెలాఖరులోగా నియామకాల ప్రాథమిక ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.