- కాంగ్రెస్ హయాంలోనూ భూభారతి పేరుతో అక్రమాలు
- త్వరలోనే పీపీటీ ద్వారా వివరిస్తానన్న బీజేఎల్‌పీ నేత
హైదరాబాద్, వెలుగు:బీఆర్ఎస్ హయాంలో ధరణి పేరుతో జరిగిన భూదోపిడీపై నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికను ప్రభుత్వం వెంటనే బయటపెట్టాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో భూదోపిడీ అంశాలు వెలుగులోకి రాగా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భూ భారతి పేరుతో మరో వ్యవస్థ ద్వారా భూ అక్రమాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు.
శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర విమర్శలతో అసలు భూదోపిడీ నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నాయని చెప్పారు. వారం రోజులుగా తమ దృష్టికి వచ్చిన ఆధారాలను త్వరలో పీపీటీ ద్వారా ప్రజల ముందు పెడతామని తెలిపారు. పార్టీలో చర్చించి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో సంప్రదించి కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 57 ఏళ్ల వయస్సులోనూ రాజకీయ ఆర్భాటాలకు, నిరసన ప్రదర్శనలకు ప్రాధాన్యత ఇవ్వడం కాకుండా.. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు.
ప్రతిపక్ష నేతగా ప్రజాస్వామ్య సంస్థలను గౌరవించాలని, దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు. ఓట్ల చోరీ పేరుతో రాహుల్ చేస్తున్న ఆరోపణలను తప్పుబట్టారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఆర్డీవోలు, బీఎల్ఓల ద్వారా నిర్వహిస్తున్నారని, ఆధారాలు లేకుండా ఎన్నికల వ్యవస్థపై రాజకీయ ఆరోపణలు సరికాదన్నారు. అలాగే, ఎలాన్ మస్క్ ట్వీట్‌కు రాహుల్ మద్దతు పలకడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశ భద్రతకు సంబంధించిన కీలక అంశాలు విదేశీ సంస్థల చేతుల్లోకి వెళ్లే ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని, జాతీయ భద్రతను పణంగా పెట్టే విధానాలకు మద్దతు ఇవ్వడం సరికాదన్నారు. దేశ ప్రయోజనాలే తమ పార్టీకి ఫస్ట్ ప్రయార్టీ అని ఏలేటి స్పష్టం చేశారు.
