న్యూఢిల్లీ: అసమ్మతిని అణచివేసేందుకు లక్షలాది మంది ప్రజలకు ఇబ్బందులు కలిగించడం సరైంది కాదని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. ప్రజల భిన్నాభిప్రాయాలను, శాంతియుత నిరసన తెలిపే హక్కును ప్రతి ప్రభుత్వం గౌరవించాలని స్పష్టం చేశారు. శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా స్పందించిన ఆయన.. కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ఆత్మవిశ్వాసం ఉన్న ప్రభుత్వం అసమ్మతిని గౌరవిస్తుందని, దాన్ని అణచేందుకు ప్రజలకు అసౌకర్యం కలిగించదని పేర్కొన్నారు.
ప్రజా భద్రతతో పాటు పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడటం కూడా ముఖ్యమన్నారు. ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగించరాదని సూచించారు. ఢిల్లీలో నిరసనల నేపథ్యంలో రవాణా సేవలపై పూర్తి నిషేధం విధించకుండా, నియంత్రిత పద్ధతిలో నడపాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది.
