న్యూఢిల్లీ: అమెరికాకు ఇక భారతీయ టెకీలు ఎంతమాత్రం అవసరం లేదని ‘జోహో’ టెక్ కంపెనీ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు అన్నారు. ఇండియన్ టెకీలంతా వెనక్కి తిరిగి వచ్చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రముఖ భారతీయ, గ్లోబల్ ఐటీ కంపెనీలకు గ్రీన్ కార్డ్ సంబంధిత పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్(పర్మ్) కార్యక్రమాన్ని అమెరికా రద్దు చేసిన నేపథ్యంలో శ్రీధర్ వెంబు ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. అమెరికాలో పని చేస్తున్న భారతీయులు తిరిగి వచ్చి, దేశ నిర్మాణంలో పాలు పంచుకోవాలని కోరారు.
గత కొన్ని దశాబ్దాలుగా అమెరికాలో భారతీయులు సాధించిన ఆర్థిక, సాంకేతిక ప్రభావాన్ని హైలైట్ చేశారు. ‘‘టెక్ రంగంలో అమెరికా అగ్ర స్థానంలోకి చేరడంలో భారతీయుల కృషి ఎంతో ఉంది. అయినప్పటికీ, అమెరికాలో ఒక పెద్ద వర్గం ఇకపై మనల్ని కోరుకోవడం లేదు” అని ఆయన స్పష్టం చేశారు. ‘‘అమెరికాలో వీసాపై ఉన్న భారతీయులు కష్టపడి నిర్మించుకున్న జీవితాన్ని బలవంతంగా వదులుకోవాల్సిన బాధాకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అందుకే, వారు భారత్‌కు తిరిగి రావడానికి ఇదే సరైన సమయం కావచ్చు. ఒక ధైర్యవంతమైన కొత్త భవిష్యత్తుకు నాంది పలుకనివ్వండి. తిరిగి వచ్చేయండి, భారత్‌ను నిర్మిద్దాం” అని పిలుపునిచ్చారు.
