ముంబై: మహారాష్ట్రలోని ధూలె జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని సావల్డే ప్రాంతంలో తాపి నదిలో నవదంపతుల మృతదేహాలు బయటపడడం స్థానికంగా కలకలం సృష్టించింది. మృతదేహాల కాళ్లు ఇనుప గొలుసుతో కట్టేసి, తాళం వేసి ఉందని పోలీసులు తెలిపారు. మృతులను జల్గావ్ జిల్లా అమల్నేర్ తాలూకాకు చెందిన శ్యామ్ హరి పాటిల్, స్వప్న పాటిల్ గా గుర్తించామని చెప్పారు.
కొన్ని నెలల క్రితమే వారు ప్రేమ వివాహం చేసుకున్నారని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. మృతదేహాల కాళ్లు రెండూ చైన్ తో కట్టేసి ఉండడంపై స్థానికులు సందేహాలు వ్యక్తం చేస్తుండగా.. వారిది హత్యా లేక ఆత్మహత్యా అనేది ఇప్పుడే చెప్పలేమని పోలీసులు చెప్పారు. విచారణ తర్వాతే మరణానికి కారణం తెలుస్తుందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
