లక్నో: సీఎం యోగి ఆదిత్యనాథ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల హీట్ రాజుకుంది. అయోధ్య నుంచి పోటీ చేయాలని అఖిలేష్ యాదవ్ విసిరిన సవాల్‌ను ఒక కండీషన్‌తో సీఎం యోగి స్వీకరించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అయోధ్య నుంచి పోటీ చేసేందుకు తాను సిద్ధమన్న యోగి.. అఖిలేష్ యాదవ్ కూడా ఇక్కడి నుంచే పోటీ చేయాలని కండీషన్ పెట్టారు. యోగి ఛాలెంజ్‌పై అఖిలేష్ అంతే ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ప్రజల ఆగ్రహంతో బీజేపీ అహంకారం ఈసారి తుడిచిపెట్టుకుపోతుందని కౌంటర్ ఇచ్చారు.
దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయ్: అఖిలేష్
సీఎం యోగికి సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సవాల్ విసిరారు. 2026, అక్టోబర్ 8న అయోధ్యలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు దమ్ముంటే 2027 అసెంబ్లీ ఎన్నికల్లో అయోధ్య నుంచి పోటీ చేయాలని చాలెంజ్ చేశారు. అయోధ్యలో బీజేపీ వెనకబడి ఉందని వారి సర్వేల్లో తేలిందని ఆరోపించారు. కోట్లాది మంది రామభక్తుల మనోభావాలను కించపరుస్తూ అయోధ్య రామాలయంలో చోరీకి పాల్పడటంతో బీజేపీపై అయోధ్య ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని పేర్కొన్నాడు.
చాలెంజ్ యాక్సెప్టెడ్.. బట్ వన్ కండీషన్..!
అయోధ్య నుంచి పోటీ చేయాలన్న అఖిలేష్ యాదవ్ సవాల్‌ను సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వీకరించారు. వచ్చే ఎన్నికల్లో అయోధ్య నుంచి పోటీ చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. అయితే, అఖిలేష్ యాదవ్ కూడా ఇక్కడి నుంచే పోటీ చేయాలని.. ఎవరి సత్తా ఏంటో తేల్చుకుందామన్నారు. అయోధ్య మతపరమైన ప్రాముఖ్యత కలిగిన ప్రదేశమని.. దానిని రాజకీయ పోరాట క్షేత్రంగా మార్చకూడదని చురకలంటించారు. మేము రాజకీయాల కోసం కాదు అభివృద్ధి కోసమే అయోధ్యకు వెళ్తామని చెప్పారు.
సమాజ్‌వాదీ పార్టీకి కుటుంబం గురించి తప్ప మరో ఆలోచన లేదని యోగి విమర్శించారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఇద్దరు అభ్యర్థులను బరిలోకి దింపగా.. వారిలో ఒకరు అఖిలేశ్ బాబాయి రామ్ గోపాల్ యాదవ్, మరో సీటును పారిశ్రామికవేత్త ధన్‌రాజ్ పరిమల్ నత్వానీకి కేటాయించారని గుర్తు చేశారు. వెనుకబడిన వర్గాలు, దళితులు, బ్రాహ్మణులు సహా ఇతర వర్గాలకు అవకాశం ఇవ్వలేదని ఎస్పీని కార్నర్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 80 శాతం సీట్లు గెలుస్తోందని యోగి ధీమా వ్యక్తం చేశారు.
అహంకారాన్ని ప్రజలు అంతం చేస్తరు: అఖిలేష్
అయోధ్యలో తనపై పోటీ చేయాలన్న సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలకు అఖిలేష్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పెనుగాలి వచ్చి బీజేపీ అహంకారమంతా కొట్టుకుపోతుందని అన్నారు. కోట్లాది మంది రామభక్తుల మనోభావాలను కించపరుస్తూ అయోధ్య రామాలయంలో చోరీకి పాల్పడటంతో బీజేపీపై అయోధ్య ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని పేర్కొన్నాడు.
అయోధ్యలో కానుకలు, విరాళాలు దొంగలించిన బీజేపీ అభ్యర్థిని ఓడించడానికి తాను అవసరం లేదని.. ఒక ఎస్పీ సైనికుడు సరిపోతాడని కౌంటర్ ఇచ్చారు. దొంగలకు క్లీన్ చిట్ ఇచ్చేవారు కూడా అందులో భాగస్వాములేనని, ఈసారి ప్రజలు పాలకుల అహాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తారని వ్యాఖ్యానించారు. అలాగే, గత లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్య స్థానంలో బీజేపీ తమ పరాజయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన ఎద్దేవా చేశారు.
