న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నాయనమ్మ సావిత్రిబాయి శంకర్ దీప్కే (85) మరణించారు. అనారోగ్యంతో శనివారం (అక్టోబర్ 10) మహారాష్ట్రలోని తన స్వస్థలంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు అభిజిత్ దీప్కేకు తెలియజేశారు.
నిర్బంధంలో ఉండి నిరసనను కొనసాగించాలా లేక నాయనమ్మ అంత్యక్రియలకు ఇంటికి వెళ్లాలా అనేది అతని ఇష్టమని తెలిపారు. అభిజిత్ దీప్కే వెళ్తానంటే తగిన ఏర్పాట్లు చేస్తామని పోలీసులు చెప్పారు. కాగా, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 10న జంతర్ మంతర్ దగ్గర సీజేపీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం ఉదయం ముంబై నుంచి ఢిల్లీ వచ్చిన అభిజిత్ దీప్కేను ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడు ఢిల్లీ పోలీసులు కస్టడీలోనే ఉన్నాడు. నాయనమ్మ అంత్యక్రియలకు వెళ్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
