చెన్నై:తమిళ సంస్కృతి, భాషపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. తమిళ ప్రజలపై హిందీని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ప్రతి ప్రాంతం తన భాష, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునే హక్కును గౌరవించాలని అన్నారు.
తమిళనాడు పర్యటనలో భాగంగా ‘ఛాత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ యువ విద్యార్థుల సమస్యలపై మాట్లాడారు. విద్య, ఉద్యోగాలతో పాటు వివిధ రంగాల్లో వివక్ష కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని, మహిళలపై వేధింపులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
తమిళనాడు గడ్డపై ఉండటం తనకు దక్కిన గొప్ప గౌరవమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తమిళ ప్రజల నుంచి తాను ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటానని చెప్పారు. తమిళ సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర పట్ల తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. ప్రతి ప్రాంతానికి ప్రత్యేకమైన సంస్కృతి ఉంటుందని, దానిని గౌరవించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
దేశంలోని ప్రతి వ్యవస్థలోనూ వివక్ష కొనసాగుతోందని రాహుల్ గాంధీ విమర్శించారు. విద్య, ఉద్యోగాలు సహా అన్ని రంగాల్లో ప్రజలు అవమానాలను ఎదుర్కొంటున్నారని అన్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రావాలని, మహిళలపై వేధింపులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.పెరియార్ గొప్ప మహానాయకుడని కొనియాడిన రాహుల్ గాంధీ.. సమాజంలోని ప్రతి అంశాన్ని ఆయన ప్రశ్నించారని గుర్తుచేశారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం సాధించేందుకు పెరియార్ ఆలోచనలు ఎంతో కీలకమన్నారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన సమయం ఆసన్నమైందని రాహుల్ గాంధీ అన్నారు. ఓట్ల దొంగతనం ద్వారా ప్రజల సంప్రదాయాలు, సంస్కృతిని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బీజేపీతో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) కుమ్మక్కై ఓట్ల దొంగతనానికి పాల్పడుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
దేశంలోని విద్యా వ్యవస్థలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)కు చెందిన వ్యక్తులను నియమిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్‌లర్ల నియామకాల్లోనూ ఆర్ఎస్ఎస్ భావజాలానికి చెందిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు.నీట్ పరీక్ష విషయంలో తమిళనాడు విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యా విధానాల్లో మార్పులు తీసుకురావాలని, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని రాహుల్ గాంధీ అన్నారు.
