Team India Playing XI: భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా కాసేపట్లో (అక్టోబర్ 11, ఆదివారం) జరగనున్న కీలకమైన మూడో టీ20 మ్యాచ్‌కు ముందు ఇండియా ప్లేయింగ్ ఎలెవెన్ (Playing XI) పై ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు, మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1–1తో సమంగా ఉన్న ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో లీడ్ సాధించాలంటే టీమిండియా మేనేజ్‌మెంట్ జట్టు కాంబినేషన్‌లో మార్పులు చేయాలని సూచించాడు. ఆల్ రౌండర్ నమన్ ధీర్ (Naman Dhir) స్థానంలో యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ (Prince Yadav) ను ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి తీసుకోవాలని ఆకాశ్ తెలిపాడు.
నమన్ ధీర్ తప్పు చేయలేదు:
తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. గత మ్యాచ్‌లో నమన్ ధీర్‌కు బౌలర్‌గా పెద్దగా బాధ్యతలు దక్కలేదు. ఇండోర్ గ్రౌండ్ కూడా చిన్నది కావడం, పైగా మంచు (Dew) ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఈ మ్యాచ్‌లోనూ అతనికి బౌలింగ్ వేసే అవకాశం రాకపోవచ్చు.. తొలి టీ20లో అతను మూడు వికెట్లు తీసిన మాట వాస్తవమే, కానీ అతను బ్యాటింగ్ చేసే స్థానం వరకు బ్యాటింగ్ రావడం లేదన్నాడు. నమన్ ధీర్ ఎలాంటి తప్పూ చేయలేదు, అతన్ని పక్కన పెట్టడం కొంత ఆశ్చర్యపరిచే నిర్ణయమే కావొచ్చు.. కానీ మైదానంలో బ్యాట్ వర్సెస్ బ్యాట్ వార్ జరుగుతున్నప్పుడు.. అద్భుతమైన బౌలింగ్ స్పెల్ మాత్రమే మ్యాచ్‌ను మలుపు తిప్పగలదు.. అందుకే అతని స్థానంలో ప్రిన్స్ యాదవ్‌ను ఆడిస్తే బాగుంటుందని ఆకాశ్ చోప్రా తెలిపాడు.
ప్రిన్స్ యాదవ్‌కు అవకాశం దక్కేనా?:
ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్‌లు కొత్త బంతితో బౌలింగ్ దాడిని ప్రారంభిస్తున్నారు. బెంచ్ మీదే ఉన్న ప్రిన్స్ యాదవ్ కు ఈ మ్యాచ్ ద్వారా అవకాశం ఇస్తే జట్టు బౌలింగ్ లైనప్‌కు మరింత బలం చేకూరుతుందని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు.
టాస్ మాత్రమే మ్యాచ్ విజేతను నిర్ణయించే ఛాన్స్:
రాంచీ టీ20లో భారత్ చేసిన 249 రన్స్ భారీ లక్ష్యాన్ని విండీస్ మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన సంగతి తెలిసిందే. చిన్న బౌండరీలు, ఫ్లాట్ పిచ్‌లు, విపరీతమైన మంచు కారణంగా ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు ఏ జట్టు కూడా లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. కాబట్టి ఇండోర్‌లోనూ టాస్ గెలిచి రెండోదిగా బ్యాటింగ్ (ఛేజింగ్) చేసే జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
