న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసన దృష్ట్యా ఢిల్లీలో పోలీసులు విధించిన ఆంక్షలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బారికేడ్లన్నింటినీ వెంటనే తొలగించాలని, మెట్రో సేవలు యధావిధిగా పనిచేసేలా చూడాలని కేంద్రాన్ని, ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. అలాగే, ఇంటర్నెట్‌కు ఎలాంటి అంతరాయాలు కలగకూడదని కూడా కోర్టు పేర్కొంది.
ప్రజలను వారి రోజువారి పనులు చేసుకోకుండా నిరోధించకూడదని, ప్రజల రాకపోకలను సాధారణ స్థితికి తీసుకురావాలని పోలీసులకు సూచించింది. శాంతియుతంగా గుమిగూడిన వారిని చట్టవిరుద్ధంగా నిర్బంధించరాదని.. ఏ నిర్బంధమైనా చట్టం నిర్దేశించిన విధానాన్ని అనుసరించి జరగాలని కోర్టు ఆదేశించింది. అయితే, శాంతిభద్రతలను కాపాడటానికి అవసరమైతే తగిన ఆంక్షలు విధించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఈ మేరకు జస్టిస్ జయమల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఆదివారం (అక్టోబర్ 11) ఈ ఆదేశాలు జారీ చేసింది. తమ మునుపటి ఉత్తర్వును ధిక్కరించి ఢిల్లీలో ఆంక్షలు విధించడంపై మంగళవారం (అక్టోబర్ 13) లోగా స్పందన కోరుతూ ఢిల్లీ పోలీసులకు, కేంద్ర హోం కార్యదర్శికి, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC)కు న్యాయస్థానం నోటీసు జారీ చేసింది.
సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ ప్రాంగణంలో కాక్రోచ్ జనతా పార్టీ భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నిరసనకు అనుమతి నిరాకరించిన ఢిల్లీ పోలీసులు దేశ రాజధానిలో పలు ఆంక్షలు విధించారు.
ట్రాఫిక్ ఆంక్షలు, మెట్రో సర్వీస్ నిలిపివేత, ఇంటర్న్ బంద్ వంటి ఆంక్షలు విధించడంతో పాటు పలువురు ఆందోళనకారులు, రాజకీయ నాయకులను నిర్భంధించారు. ఈ క్రమంలో పోలీసులు ఆంక్షలను సవాల్ చేస్తూ పలువురు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదివారం (అక్టోబర్ 11) ప్రత్యేక విచారణ చేపట్టింది.
ప్రజాశాంతి పరిరక్షణకు ఆంక్షలు అవసరమైతే తప్ప మెట్రో మరియు రైలు సేవలు యథావిధిగా పనిచేయాలని ఆదేశించింది. చట్టానికి అనుగుణంగా ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలగకూడదని, చట్టబద్ధమైన ఆంక్షలు, ట్రాఫిక్ అవసరాలకు లోబడి ప్రజల, వాహనాల స్వేచ్ఛా రాకపోకలను అనుమతించాలని అధికారులను ఆదేశించింది.
భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS)లోని సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞల పరిధిలోకి రాని ప్రాంతాలలో, ముఖ్యంగా చట్టం నిర్దేశించిన విధానానికి అనుగుణంగా తప్ప శాంతియుత నిరసనకారులను చట్టవిరుద్ధంగా నిర్బంధించరాదని కోర్టు పేర్కొంది.
నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో రవాణా సేవలపై ఆంక్షలకు సంబంధించి తాను గతంలో జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించారనే ఆరోపణలపై, కేంద్ర హోం కార్యదర్శి, ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC)లకు సుప్రీంకోర్టు ధిక్కార చర్యల కింద నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 13లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
